Rahul Gandhi OU : కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు, వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీ(Rahul Gandhi OU) తెలంగాణలో పర్యటించనున్నారు. మే 6న వరంగల్ వేదికగా రైతు సంఘర్షణ సభను ఏర్పాటు చేసింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ.
ఇందులో భాగంగా సభ అనంతరం మే 7న రాహుల్ గాంధీ ఉస్మానియా యూనివర్శిటీ లోని ఆర్ట్స్ కాలేజీ వద్ద సభ నిర్వహించాలని నిర్ణయించారు.
ఈ మేరకు టీపీసీసీ ఆధ్వర్యంలో ఓయూలో సభ నిర్వహించేందుకు గాను అనుమతి ఇవ్వాల్సిందిగా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ కు దరఖాస్తు చేసుకుంది.
దీనిని పరిశీలించిన కౌన్సిల్ రాహుల్ గాంధీ సభకు పర్మిషన్ ఇవ్వడం లేదని స్పష్టం చేసింది. రాహుల్ గాంధీ సభకే కాదు ఉస్మానియా యూనివర్శిటీలో ఏ బహిరంగ సభలకు కూడా తాము అనుమతి ఇవ్వకూడదని నిర్ణయించినట్లు ఓయూ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ తీర్మానం చేసింది.
ఇది విద్యార్థులు చదువుకునే ప్రాంగణమని, రాజకీయాలకు, నేతల సభలకు వేదిక కాదని స్పష్టం చేసింది. అంతే కాదు క్యాంపస్ లోకి ఎవరైనా కెమెరాలను తీసుకు వచ్చినా లేదా వాడినా లేదా వ్యతిరేకంగా ప్రసారం చేసినా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది కౌన్సిల్.
కెమెరాలను నిషేధించినట్లు తెలిపింది. ఇదిలా ఉండగా ఎట్టి పరిస్థితుల్లో రాహుల్ గాంధీ ఓయూకు హాజరవుతారని చెప్పారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.
ఈ సందర్భంగా విద్యార్థులతో ముఖాముఖి ఉంటుందని కూడా చెప్పారు. ఓయూ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ తాము కోర్టుకు వెళ్లనున్నట్లు ఓ సీనియర్ నాయకుడు వెల్లడించారు.
Also Read : తెలంగాణ సీఎస్ పై సీజేఐ సీరియస్