Imran Khan : పాకిస్తాన్ ను ముంచిన అమెరికా
నిప్పులు చెరిగిన ఇమ్రాన్ ఖాన్
Imran Khan : పాకిస్తాన్ దేశ మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ మరోసారి నిప్పులు చెరిగారు. తనపై కుట్ర జరిగిందని, కొన్ని విదేశీ శక్తులు తనను తప్పుకునేలా చేశాయంటూ ఇప్పటికే సంచలన ఆరోపణలు చేశారు.
ఈసారి నేరుగా అమెరికాపై విమర్శ బాణాలు ఎక్కుపెట్టారు. తమ దేశాన్ని బానిసగా మార్చేసిన ఘనత అగ్ర రాజ్యానికే దక్కుతుందన్నారు.
ఆక్రమించు కోకుండానే తమను అడుక్కునే వాళ్లుగా మార్చేసి పైకి నీతులు వల్లిస్తోందంటూ ధ్వజమెత్తారు ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) . దేశాన్ని జలగల్లా పీల్చుకు తిన్న దొంగలు, అక్రమార్కులు, అవినీతి పరులు ఇప్పుడు పాలకులుగా మారారని మండిపడ్డారు.
ఇప్పటికే మొత్తం ఊడ్చేశారని ఇంకేం మిగిలి ఉందని పాలన సాగిస్తారంటూ ప్రశ్నించారు. తాను అడ్డుగా ఉన్నానని విదేశీ శక్తుల సాయంతో తనను దిగి పోయేలా చేశారంటూ ఆరోపించారు ఇమ్రాన్ ఖాన్.
వలస వాదుల్ని, ఇతర దేశాల ఆధిపత్యాన్ని పాకిస్తాన్ ప్రజలు ఎన్నడూ అంగీకరించ బోరంటూ స్పష్టం చేశారు. ఆత్మనైనా అమ్ముకుంటారు కానీ తలవంచరని నిప్పులు చెరిగారు మాజీ ప్రధాన మంత్రి.
తను పదవి నుంచి దిగి పోయాక ప్రస్తుత ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) దేశ వ్యాప్తంగా ర్యాలీలు, బహిరంగ సభలలో పాల్గొంటున్నారు. తనకు లాభం లేనిదే అమెరికా ఏ దేశానికి సాయం చేయదని సంచలన ఆరోపణలు చేశారు.
వచ్చేసారి ఎన్నికల్లో ప్రజల్ని సమీకరించి మరోసారి అధికారంలోకి రావాలని ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. పాకిస్తాన్ మాజీ క్రికెటర్ గా, ఆ దేశానికి వరల్డ్ కప్ తీసుకు వచ్చిన నాయకుడిగా పేరొందారు. ఖాన్ కు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది.
Also Read : నేపాల్ తో బంధం బలమైనది