ISIS Claims : ప్ర‌వ‌క్త‌పై కామెంట్స్ చేసినందుకే దాడి చేశాం

కాబూల్ గురుద్వారా దాడి మా ప‌నే ఐఎస్ఐఎస్

ISIS Claims : గ‌త కొంత కాలంగా ప్ర‌శాంతంగా ఉన్న ఆఫ్గ‌నిస్తాన్ రాజ‌ధాని కాబూల్ లో ఒక్క‌సారిగా దాడి జ‌ర‌గ‌డంతో ప్ర‌పంచం మ‌రోసారి ఉలిక్కి ప‌డింది. గురుద్వారా స‌మీపంలో బాంబు పేలుళ్లు, తుపాకుల మోత మోగింది.

ఈ ఘ‌ట‌న‌లో ఇద్ద‌రు మృతి చెంద‌గా ఏడుగురికి తీవ్ర గాయాల‌య్యాయి. ఈ సంద‌ర్భంగా ఎవ‌రు ఈ దాడికి పాల్ప‌డ్డార‌ని విచార‌ణ ప్రారంభించిన ఆఫ్గ‌న్ పోలీసుల‌కు స‌వాల్ విసిరింది ఐఎస్ఐఎస్.

తామే ఈ ఘ‌ట‌న‌కు పాల్ప‌డిన‌ట్లు ప్ర‌క‌టించింది. భార‌త దేశంలోని భార‌తీయ జ‌న‌తా పార్టీ నుంచి బ‌హిష్క‌ర‌ణ‌కు గురైన నూపుర్ శ‌ర్మ మ‌హ్మ‌ద్ ప్ర‌వ‌క్త‌పై అనుచిత వ్యాఖ్యలు చేయ‌డాన్ని ఖండిస్తూ తాము ఈ దాడికి పాల్ప‌డిన‌ట్లు వెల్ల‌డించింది.

ఇందులో ఎవ‌రి ప్ర‌మేయం లేద‌ని తామే దీనికి పాల్ప‌డిన‌ట్లు స్ప‌ష్టం చేసింది ఐఎస్ఐఎస్ ఉగ్ర‌వాద సంస్థ‌(ISIS Claims). ఇప్ప‌టికే ప‌లు దేశాలు ఈ వ్యాఖ్య‌ల్ని ఖండించాయి. ఇది ప్ర‌వ‌క్త ముహమ్మ‌ద్ ను అవ‌మానించినందుకు ప్ర‌తీకార చ‌ర్య‌గా పేర్కొంది.

హిందువులు, సిక్కులు ప్రార్థ‌న‌లు జ‌రుపుతున్న గురుద్వార్ లోకి త‌మ సంస్థ‌కు చెందిన ఒక యోధుడు ప్ర‌వేశించాడు. అక్క‌డ గార్డును చంపాడు. అన్య‌మ‌త‌స్తుల‌పై త‌న మెషిన్ గ‌న్ , హ్యాండ్ గ్రెనేడ్ ల‌తో కాల్పులకు పాల్ప‌డిన‌ట్లు ఐఎస్ఐఎస్ తెలిపింది.

ఇదిలా ఉండ‌గా గురుద్వారా లోకి ప్ర‌వేశించిన‌ప్పుడు దాడి చేసిన వారు క‌నీసం ఒక గ్రెనేడ్ ను ప్ర‌యోగించార‌ని, మంట‌ల‌ను త‌మ సిబ్బంది ఆర్పార‌ని ఆఫ్గ‌నిస్తాన్ అంత‌ర్గ‌త వ్య‌వ‌హారాల మంత్రిత్వ శాఖ ప్ర‌తినిధి అబ్దుల్ న‌ఫీ టాక‌ర్ వెల్ల‌డించారు.

కాగా భార‌త దేశం నుండి ఆఫ్గ‌నిస్తాన్ కు మాన‌వ‌తా సాయం పంపిణీపై చ‌ర్చించేందుకు భార‌త ప్ర‌తినిధి బృందం కాబూల్ ను సంద‌ర్శించిన అనంత‌రం ఈ దాడి జ‌ర‌గ‌డం క‌ల‌క‌లం రేపింది.

Also Read : కాబూల్ లో పేలుళ్లు..భార‌త్ దిగ్భ్రాంతి

Leave A Reply

Your Email Id will not be published!