UP Deputy CM : తెలంగాణలో కేసీఆర్ ఖేల్ ఖతం
యూపీ డీప్యూటీ సీఎం మౌర్య కామెంట్
UP Deputy CM : ఉత్తర ప్రదేశ్ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య(UP Deputy CM) సంచలన కామెంట్స్ చేశారు. మోదీ రాష్ట్ర పర్యటనలో భాగంగా ఏర్పాట్లను పరిశీలించేందుకు డిప్యూటీ సీఎం గురువారం హైదరాబాద్ కు వచ్చారు.
ఈ సందర్భంగా కేశవ్ ప్రసాద్ మౌర్య మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ పాలనకు రోజులు దగ్గర పడ్డాయని అన్నారు.
రాబోయే 2023లో జరిగే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తుందని, ప్రజలు కాషాయ జెండాను ఎగర వేయాలని అనుకుంటున్నారని చెప్పారు.
ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల నుంచి రాష్ట్ర స్థాయి దాకా ఎక్కడ చూసినా కాషాయం కనిపిస్తోందన్నారు. అమలుకు నోచుకోని హామీలతో మభ్య పెట్టడం సీఎం కేసీఆర్ కు అలవాటుగా మారిందని ఆరోపించారు.
ఏ ఒక్క దానిని అమలు చేయకుండా దేశ రాజకీయాల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. మోదీని ఢీకొనే సీన్ సీఎంకు లేదని ఎద్దేవా చేశారు కేశవ్ ప్రసాద్ మౌర్య.
ఎక్కడ చూసినా బీజేపీని జనం ఆదరిస్తున్నారని, అక్కున చేర్చుకుంటున్నారని చెప్పారు. ప్రజలు పని చేసే సీఎంను కావాలని కోరుకుంటారని, కానీ ఫామ్ హౌజ్ కే పరిమితం కావాలని కోరుకోవడం లేదన్నారు.
దేశ రాజకీయాల కంటే ముందు తెలంగాణ రాష్ట్రంపై ఫోకస్ పెడితే బాగుంటుందన్నారు. లేక పోతే ఉన్నది కూడా ఊడి పోయే ప్రమాదం ఉందన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా పోస్టర్లు పెడితే బహుజనులు ఎన్నటికీ సీఎం కేసీఆర్ ను క్షమించరన్నారు.
మహారాష్ట్రలో అనైతిక పొత్తు పెట్టుకున్న ఉద్దవ్ ఠాక్రేను ప్రజలు వ్యతిరేకించారని గుర్తు చేశారు డిప్యూటీ సీఎం.
Also Read : యశ్వంత్ సిన్హాకు ఘన స్వాగతం పలకాలి