AB Venkateswara Rao: ఎట్టకేలకు విధుల్లోకి ఏబీవీ ! బాధ్యతలు స్వీకరించిన రోజే పదవీ విరమణ !

ఎట్టకేలకు విధుల్లోకి ఏబీవీ ! బాధ్యతలు స్వీకరించిన రోజే పదవీ విరమణ !

AB Venkateswara Rao: సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును ఎట్టకేలకు ఏపీ ప్రభుత్వం సర్వీసులోకి తీసుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆయన్ను ప్రింటింగ్‌ అండ్‌ స్టేషనరీ, స్టోర్స్‌ పర్చేజ్‌ కమిషనర్‌ గా నియమిస్తూ సీఎస్‌ జవహర్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. దీనితో ఆయన శుక్రవారం విజయవాడలోని కార్యాలయంలో పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనకు ప్రింటింగ్‌ అండ్‌ స్టేషనరీ, స్టోర్స్‌ పర్చేజ్‌ శాఖ సిబ్బంది ఆయనకు ఘన స్వాగతం పలికారు. అయితే పదవీ బాధ్యతలు స్వీకరించిన కొన్ని గంటలకే ఆయన పదవీ విరమణ కూడా పోందారు. ఈ సందర్భంగా ఆయన పదవీ విరమణకు పోలీసు శాఖతో పాటు కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, శ్రయోభిలాషులు పాల్గొన్నారు.

AB Venkateswara Rao…

ఈ సందర్భంగా ఏబీవీ మాట్లాడుతూ… బాధ్యతలు స్వీకరించిన రోజే పదవీ విరమణ చేయాల్సిన పరిస్థితి వచ్చిందని అన్నారు. ‘‘రెండు సంవత్సరాల తర్వాత ఇదే ఆఫీసులో ఛార్జ్‌ తీసుకుంటున్నా. నాకు అభినందనలు తెలిపేందుకు వచ్చిన వారికి కృతజ్ఞతలు. ఇవాళ నా పదవీ విరమణ రోజు.. ఈ రోజే పోస్టింగ్‌ ఆర్డర్‌ తీసుకున్నా. సాయంత్రం పదవీ విరమణ చేసే అవకాశం నాకు మాత్రమే వచ్చింది. కారణాలు ఏమైనా ఆల్‌ ఈజ్‌ వెల్‌ అని భావిస్తున్నా. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నా.. ఎలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు. పోస్టింగ్‌ ఆర్డర్లు వచ్చాయి.. విధుల్లో చేరాను. ఇప్పటికి ఇంత వరకు మాత్రమే మాట్లాడాలి. ఇంతకాలం నాకు అండగా ఉండి ధైర్యం చెప్పిన మిత్రులు, శ్రేయోభిలాషులకు రుణపడి ఉంటాను. నా కుటుంబ సభ్యులు, స్నేహితులకు ధన్యావాదలు. యూనిఫాంతో పదవీ విరమణ చేయడం నా కల నెర వేరినట్లుగా భావిస్తున్నా’’ అని ఏబీవీ తెలిపారు.

ప్రభుత్వం చేసిన సస్పెన్షన్ పై సుదీర్ఘంగా న్యాయ పోరాటం చేసి విజయం సాధించిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు(AB Venkateswara Rao) సగర్వంగా బాధ్యతల నుంచి తప్పుకొన్నారు. సర్వీసులో చివరి రోజైన శుక్రవారం ఉదయం విజయవాడ ముత్యాలంపాడులోని ప్రింటింగ్‌ అండ్‌ స్టేషనరీ ప్రాంతీయ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టిన ఏబీవీ… సాయంత్రానికే పదవీ విరమణచేశారు. పోలీసుశాఖలో డైరెక్టర్‌ జనరల్‌ హోదాలో ఉన్న ఏబీ వెంకటేశ్వరరావు(AB Venkateswara Rao) డీజీపీ కాకుండానే రిటైర్‌ అయ్యారు. ఆయన అభిమానులు, ఉద్యోగులు భారీగా తరలివచ్చి ఘనంగా వీడ్కోలు పలికారు. సీనియర్‌ ఐపీఎస్‌, ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు, ఐఏఎస్‌ అధికారి చెరుకూరి శ్రీధర్‌, టీడీపీ నేత పట్టాభి, అమరావతి ఐకాస నేతలు సహా పలువురు ఐపీఎస్‌లు, ఐఏఎస్‌లు ఏబీవీని కలిసి పదవీ విరమణ శుభాకాంక్షలు తెలిపారు. తనను కలిసిన ఆత్మీయులను హత్తుకున్న ఏబీవీ.. ఒకింత ఉద్వేగానికి లోనయ్యారు. పోలీసు యూనిఫాంతో ఉన్న ఏబీవీ ఫొటోపై ఫైటర్ అని రాసిన ప్లకార్డులను ఆయన అభిమానులు ప్రదర్శించారు.

రిటైర్‌ అయినా జీవితాంతం ప్రజా సేవలోనే ఉంటానన్న ఏబీవీ(AB Venkateswara Rao).. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసేందుకు రిటైర్‌మెంట్‌ అనంతరం తనకు అవకాశం వస్తుందని ఆశిస్తున్నట్టు తెలిపారు. ‘‘సర్వీసులో ఉన్నన్ని రోజులు నీతి.. నిజాయతీతో పనిచేశా. పూర్తి సంతృప్తితో పదవీ విరమణ చేస్తున్నా. వృత్తి రీత్యా ఎంతోమందిని చూశాను. నేను చేసిన పోరాటం చూసి.. ఎన్నో లక్షల మంది స్పందించారు. వారందరికీ రుణపడి ఉంటా. నా బాధ, పోరాటం, నిజాయతీ ఎంతో మందికి దగ్గర చేశాయి. ఈరోజు వృత్తిరీత్యా మాత్రమే రిటైరవుతున్నా. చివరి శ్వాస వరకు అన్యాయాన్ని ఎదురిస్తూనే ఉంటా. బాధితుల తరఫున పోరాడుతూనే ఉంటా’’ అని ఈ సందర్భంగా ఏబీవీ తెలిపారు.

రక్షణ పరికరాల కొనుగోలు వ్యవహారంలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలతో వైసీపీ(YCP) ప్రభుత్వం ఏబీ వెంకటేశ్వరరావును(AB Venkateswara Rao) సస్పెండ్‌ చేసింది. డైరెక్టర్‌ జనరల్‌ ర్యాంక్‌ కలిగిన ఆయనకు ఐదేళ్లుగా పోస్టింగ్‌ ఇవ్వకుండా సస్పెన్షన్ విధించింది. దీనితో ఏబీవీ క్యాట్‌ను ఆశ్రయించగా.. సస్పెన్షన్‌ను సమర్థించింది. అనంతరం ఆయన హైకోర్టుకు వెళ్లగా… ఉన్నత న్యాయస్థానం సస్పెన్షన్‌ను కొట్టివేసింది. హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. సర్వీసులో ఉన్న అధికారిని రెండేళ్ల కంటే ఎక్కువ కాలం సస్పెన్షన్‌లో ఉంచొద్దని ఆదేశిస్తూ.. ఏబీ వెంకటేశ్వరరావుపై ఉన్న సస్పెన్షన్‌ను అత్యున్నత న్యాయస్థానం రద్దు చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలకనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఏబీ వెంకటేశ్వరరావుకు పోస్టింగ్‌ ఇచ్చింది.

ఆ తర్వాత కొద్ది రోజులకే గతంలో ఏ కారణంతో సస్పెండ్‌ చేశారో… తిరిగి అదే కారణంతో మరోసారి ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది. దీనితో ఏబీవీ సస్పెన్షన్‌ చెల్లదని, ఆయన్ను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్‌ (క్యాట్‌) ఈ నెల 8న ఆదేశాలిచ్చింది. 22 రోజులు గడిచినా విధుల్లోకి తీసుకోలేదు సరికదా.. ఆ ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. క్యాట్‌ ఆదేశాల నిలుపుదలకు నిరాకరిస్తూ ఏపీ హైకోర్టు గురువారం ఉత్తర్వులిచ్చింది. ఉన్నత న్యాయస్థానం ఉత్తర్వులను సీఎస్‌ జవహర్‌రెడ్డికి, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయంలోనూ ఏబీ వెంకటేశ్వరరావు అందజేశారు. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు ఆయన్ను సర్వీసులోకి తీసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

Also Read : Sajjala Ramakrishna Reddy: సజ్జల రామకృష్ణారెడ్డిపై తాడేపల్లి పోలీస్ స్టేషన్ లో క్రిమినల్‌ కేసు !kada

Leave A Reply

Your Email Id will not be published!