Aditya Thackeray : దమ్ముంటే శివసేన వదిలి పోరాడండి
రెబెల్ ఎమ్మెల్యేలకు ఆదిత్యా ఠాక్రే సవాల్
Aditya Thackeray : మహారాష్ట్రలో రాజకీయం మరింత ముదిరి పాకాన పడింది. సోమ వారం వరకు మరాఠా అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రెబెల్ ఎమ్మెల్యేలకు గడువు ఇచ్చారు.
ఎందుకు మీపై అనర్హత వేటు వేయకూడదో చెప్పాలని, దీనికి సంజాయిషీ కోరుతూ నోటీసులు జారీ చేశారు. సోమవారం 5 గంటల వరకు గడువు ఇచ్చారు.
ఇదే సమయంలో రెబెల్స్ కు నాయకత్వం వహిస్తున్న ఏక్ నాథ్ షిండేతో పాటు మరో మంత్రి తీసుకున్న నిర్ణయాలు, చేసిన సంతకాలు చెల్లుబాటు కావంటూ స్పష్టం చేశారు సీఎం ఉద్దవ్ ఠాక్రే.
శనివారం రాత్రి శివసేన పార్టీ అత్యవసర సమావేశం నిర్వహించింది. ఈ మేరకు ఆరు కీలక తీర్మానాలను ఆమోదించింది. ఎవరైనా సరే శివసేన పార్టీ వారు తప్ప బాలా సాహెబ్ ఠాక్రే పేరును వాడుకోకూడదంటూ హెచ్చరించింది.
తాజాగా శివసేన పార్టీ పేరుపై గెలిచి ఇప్పుడు ధిక్కార స్వరం వినిపించిన ఎమ్మెల్యేలు, మంత్రి ఏక్ నాథ్ షిండేకు సవాల్ విసిరారు సీఎం ఉద్దవ్ ఠాక్రే తనయుడు మంత్రి ఆదిత్యా ఠాక్రే(Aditya Thackeray). దమ్ముంటే శివసేన పార్టీని విడిచి పోటీ చేయాలని అన్నారు.
ఎన్నికలు ఎదుర్కొనేందుకు రెడీ కావాలన్నారు. ప్రజలు ఎవరి వైపు ఉన్నారో తేలి పోతుందని స్పష్టం చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు.
ఇదిలా ఉండగా మొత్తం మహారాష్ట్ర రాజకీయం రసకందాయంలో పడింది. ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. తాము చేసింది తప్పు అనుకుంటే రాజీనామా చేసి ప్రజల్లోకి వెళ్లాలని అన్నారు ఆదిత్యా ఠాక్రే.
Also Read : మరాఠా పోరులో అంతిమ విజయం మాదే