అమరావతి : రాష్ట్రాన్ని హార్టికల్చర్, కోకో హబ్ గా తీర్చిదిద్దేలా ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు చెప్పారు. ఏలూరులో రాష్ట్ర స్థాయి కోకో కాంక్లేవ్ సదస్సును మంత్రి జ్యోతిని వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ కోకో ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందన్నారు. కోకో పంటను మరింత విస్తీర్ణంలో పెంచేలా రైతులను ప్రోత్సహించేందుకు తక్కువ ఖర్చుతో నాణ్యమైన కోకో ఉత్పత్తి, సాగులో తీసుకోవలసిన మెళకువలు, మార్కెటింగ్ సౌకర్యాలు, తదితర అంశాలపై అధికారులు, ఉద్యానవన శాస్త్రవేత్తలతో కోకో అభ్యుదయ రైతులకు అవగాహన కలిగించడమే రాష్ట్ర స్థాయి కోకో కాంక్లేవ్ ప్రధాన ఉద్దేశ్యమన్నారు.
రైతుల ప్రతీ సమస్యను ముందుగానే తెలుసుకుని వాటి పరిష్కార దిశగా తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. రాష్ట్ర జిఎస్డిపి లో వ్యవసాయం 50 వేల కోట్ల రూపాయలు ఉంటే, ఉద్యానవన శాఖ 1. 68 లక్షల కోట్లు ఉందన్నారు. రాష్ట్రంలో రైతులకు మంచి ఆదాయం అందించేలా ఉద్యానవన పంటలకు ప్రోత్సాహం అందిస్తున్నామని చెప్పారు కింజారపు అచ్చెన్నాయుడు. ఉద్యానవన రైతులకు డ్రిప్, స్ప్రింక్లర్లు, ఆటోమేషన్ అందిస్తున్నామన్నారు. విజయవాడలో అంతర్జాతీయ స్థాయిలో హార్టికల్చర్ కాంక్లేవ్ సదస్సును త్వరలో పెద్దఎత్తున నిర్వహించి ఉద్యానవన పంటల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ ని ఏర్పాటు చేసి, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు అత్యంత ప్రాధాన్యతను ఇస్తున్నదన్నారు.
