Akhilesh Yadav : యోగి ప్ర‌భుత్వం అధికార దుర్వినియోగం

నిప్పులు చెరిగిన అఖిలేష్ యాద‌వ్

Akhilesh Yadav : ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం అధికార దుర్వినియోగానికి పాల్ప‌డుతోంద‌ని ఆరోపించారు స‌మాజ్ వాదీ పార్టీ చీఫ్ , మాజీ సీఎం అఖిలేష్ యాద‌వ్ . యూపీలో మెయిన్ పురి లోక్ స‌భ నియోజ‌క‌వ‌ర్గంతో పాటు మ‌రో రెండు అసెంబ్లీ నియోక‌వ‌ర్గాల‌లో సోమ‌వారం ఉప ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి.

పోలింగ్ సంద‌ర్బంగా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్ర స‌ర్కార్ ప్ర‌జాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందంటూ ఆరోపించారు. త‌న తండ్రి ఎస్పీ ఫౌండ‌ర్ , మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ ఇటీవ‌లే మ‌ర‌ణించారు. దీంతో మెయిన్ పురి లోక్ స‌భ స్థానం ఖాళీ అయ్యింది. ఇక్క‌డ త‌న భార్య డింపుల్ యాద‌వ్ ను ఎస్పీ త‌ర‌పున నిల‌బెట్టారు.

ఇవాళ పోలింగ్ ప్రారంభ‌మైన వెంట‌నే డింపుల్ యాద‌వ్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. నియోజ‌క‌వ‌ర్గంలో బీజేపీ నాయ‌కులు, శ్రేణులు పెద్ద ఎత్తున ఓట‌ర్ల‌ను ప్ర‌లోభాల‌కు గురి చేస్తున్నారంటూ ఆరోపించారు. అంతే కాకుండా విచ్చ‌లవిడిగా డ‌బ్బులు, మ‌ద్యాన్ని పంపిణీ చేస్తున్నారంటూ మండిప‌డ్డారు.

తాము ఎన్నిక‌ల క‌మిష‌న్ కు ఫిర్యాదు చేస్తామ‌న్నారు. ఇదిలా ఉండ‌గా ఆమె భ‌ర్త అఖిలేష్ యాద‌వ్(Akhilesh Yadav) ఖాకీల తీరుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ప్ర‌భుత్వం పూర్తిగా త‌మ‌కు అనుకూలంగా ఉన్న వారిని నియ‌మించింద‌ని ఆరోపించారు. పెద్ద ఎత్తున డ‌బ్బులు, మ‌ద్యం పంపిణీ చేస్తున్నా ఎందుకు నోరు మెద‌ప‌డం లేద‌ని ప్ర‌శ్నించారు.

ఈ మొత్తం వ్య‌వ‌హారంతో పాటు పోలీసులు అనుస‌రిస్తున్న ఏక‌ప‌క్ష వైఖ‌రి గురించి తాము ఎన్నిక‌ల క‌మిష‌న్ కు ఫిర్యాదు చేస్తామ‌ని, అవ‌స‌ర‌మైతే ఇవాళ పోలింగ్ ముగిశాక ఆందోళ‌న చేప‌డ‌తామ‌ని హెచ్చ‌రించారు అఖిలేష్ యాద‌వ్.

Also Read : అహ్మ‌దాబాద్ లో ఓటు వేసిన ప్ర‌ధాని

Leave A Reply

Your Email Id will not be published!