Rakesh Tikait : మహోన్నత మానవుడు అంబేద్కర్
నివాళులు అర్పించిన రాకేశ్ టికాయత్
Rakesh Tikait : ఈ దేశం గర్వించ దగిన మహోన్నత మానవుడు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ అని కొనియాడారు సంయుక్త కిసాన్ మోర్చా నాయకుడు రాకేశ్ టికాయత్. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించారు. ఈ దేశానికి దిశా నిర్దేశం చేసిన యోధుడని కొనియాడారు.
వీరుడు, పండితుడు, తత్వవేత్త, శాస్త్రవేత్త, సంఘ సేవకుడు, సహనశీలి అని పేర్కొన్నారు రాకేశ్ టికాయత్(Rakesh Tikait). అంతే కాదు వ్యక్తిత్వంలో కూడా సంపన్నుడని ప్రశంసించారు. అంబేద్కర్ తన జీవితాన్ని మొత్తం భారతదేశం సంక్షేమం కోసం అంకితం చేశాడని ఆయన రుణం ఎప్పటికీ తీర్చుకోలేమని పేర్కొన్నారు.
సరిగ్గా ఇదే రోజు డిసెంబర్ 6న 1956లో ఇక సెలవంటూ వెళ్లి పోయారు అంబేద్కర్. ఈ దేశ చరిత్రలో నిమ్న కులాలు, పేదలు, అణగారిన వర్గాలకు సమాన అవకాశాలు దక్కాలని కోరుకున్నారని పేర్కొన్నారు రాకేశ్ టికాయత్. యావత్ ప్రపంచం విస్తు పోయేలా భారత రాజ్యాంగాన్ని రూపొందించిన శిల్పి డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ అని తెలిపారు.
ఒక వేళ అంబేద్కర్ గనుక లేక పోయి ఉంటే, ఈ పవిత్ర భారత గడ్డపై జన్మించక పోయి ఉంటే ఈ దేశం ఇలా ఉండేది కాదన్నారు. ఆయన అనుగ్రహం వల్ల, ఎంతో శ్రమకోర్చి రాజ్యాంగాన్ని రాయడం వల్ల ఇవాళ అణగారిన వర్గాలకు ప్రాతినిధ్యం లభిస్తోందన్నారు.
నిజంగా భారత రాజ్యాంగం పొందు పర్చిన అంశాలను పాలకులు గనుక అమలు చేసి ఉన్నట్లయితే ఇవాళ దేశం ఇలా ఉండేది కాదన్నారు రాకేశ్ టికాయత్. సూర్య చంద్రులు ఉన్నంత కాలం అంబేద్కర్ నిలిచే ఉంటారని స్పష్టం చేశారు రైతు నాయకుడు.
Also Read : రాహుల్ హల్ చల్ ‘కిస్’ వైరల్