AP High Court : ఏపీ హైకోర్టు సంచలన కామెంట్స్ చేసింది. రియాల్టీ షోల పేరుతో వస్తున్న కార్యక్రమాలన్నీ సమాజాన్ని తప్పు దోవ పట్టించేలా ఉన్నాయంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ప్రధానంగా బిగ్ బాస్ షోను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
వీటి వల్ల రేపటి తరం నిర్వీర్యమైన స్థితిలోకి వెళ్లే ప్రమాదం పొంచి ఉందంటూ వ్యాఖ్యానించింది. ఇలాంటి చౌకబారు షోస్ ను ఎవరూ అడ్డు కోవడం లేదని, పైపెచ్చు ప్రోత్సహిస్తుండడం బాధాకరమని పేర్కొంది.
బిగ్ బాస్ షోను నిలిపి వేయాలని కోరుతూ హైకోర్టులో(AP High Court) పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ చేపట్టారు న్యాయమూర్తులు జస్టిస్ అసనుద్దీన్ అమనుల్లా, జస్టిస్ తర్లాడ రాజశేఖర రావు తో కూడిన ధర్మాసనం.
ఈ కేసు కు సంబంధించి తదుపరి విచారణను వచ్చే మే 2న చేపడతామని తెలిపింది. ఎలాంటి సెన్సార్ షిప్ లేకుండా ప్రసారం అవుతోందని , వీటి వల్ల యువత చెడు మార్గం పడుతోందంటూ తెలుగు యువ శక్తి చీఫ్ కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి 2019లో హైకోర్టులో పిల్ వేశారు.
పిల్ తరపు న్యాయవాది శివ ప్రసాద్ రెడ్డి ధర్మాసనం ముందు ప్రస్తావించారు. దీనిపై అత్యవసర విచారణ జరిపించాలని కోరారు. రోజు రోజుకు ఈ రియాల్టీ షోల వల్ల కలిసి ఉన్న కుటుంబాలు విచ్ఛిన్నమయ్యే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇంటిల్లిపాది కలిసి కూర్చుని చూసే ప్రోగ్రామ్స్ రావడం లేదని కావాలని జుగుస్సాకరంగా ఉంటున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా మంచి పిల్ వేశారంటూ ధర్మాసనం కేతిరెడ్డిని ప్రశంసించింది.
Also Read : వదల బొమ్మాళి అంటున్న ఏబివి