Dissident Leaders : ఆజాద్ సరే అసమ్మతి నేతల దారెటు
2022లో ఎనిమిది మంది ప్రముఖులు
Dissident Leaders : కాంగ్రెస్ పార్టీలో అత్యంత అనుభవం కలిగిన నాయకుడిగా, ట్రబుల్ షూటర్ గా పేరొందిన గులాం నబీ ఆజాద్ శుక్రవారం పార్టీకి గుడ్ బై చెప్పారు. ఆయన పార్టీలో ఉంటూనే ధిక్కార స్వరం వినిపించారు.
ఇదే సమయంలో జి23 పేరుతో వేరు కుంపటి కూడా పెట్టారు. ఆజాద్ వెళ్లి పోవడంతో ఆయనతో పాటే ఉన్న వాళ్లు, ఆజాద్ ను అనుసరిస్తూ వస్తున్న వాళ్ల పరిస్థితి ఏంటి అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
అసమ్మతి నేతలుగా గుర్తింపు పొందిన నాయకులు ఉంటారా లేక ఆజాద్ వెంట వెళతారా అన్నది కొద్ది రోజుల్లో తేలనుంది. ఇదిలా ఉండగా ఈ ఏడాది కాంగ్రెస్ పార్టీ నుండి ఎనిమిది సీనియర్ నాయకులు(Dissident Leaders) పార్టీని వీడారు.
50 ఏళ్లకు పైగా గులాం నబీ ఆజాద్ పార్టీలో ఉన్నారు. ఆయన తన సుదీర్గ అనుబంధాన్ని తెంచుకున్నారు. ఆయన వీడడంతో మరికొందరు కూడా అదే బాట పట్టనున్నట్లు సమాచారం.
ఇక ఈ నెల ప్రారంభంలో జమ్మూ కాశ్మీర్ లో పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ పదవిని స్వీకరించేందుకు ఆజాద్ నిరాకరించారు.
ఆయన కంటే ముందు హార్దిక్ పటేల్ , జైవీర్ షెర్గిల్ , కపిల్ సిబల్ , ఆర్పీ సింగ్ , సునీల్ జాఖర్ , అశ్వినీ కుమార్, కుల్దీప్ బిష్నోయ్ కాంగ్రెస్ పార్టీని వీడిన వారిలో ఉన్నారు.
వీరంతా అత్యంత సీనియర్ నాయకులు. లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. త్వరలో హిమాచల్ ప్రదేశ్ , గుజరాత్ రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
ఈ తరుణంలో కీలకమైన నేతలు గుడ్ బై చెప్పడం ఆ పార్టీకి ఒకింత దెబ్బేనని చెప్పక తప్పదు. మరో వైపు శశి థరూర్, మనీష్ తివారీ, ఆనంద్ శర్మ , తదితర నాయకులు ఇప్పుడు ఎటు వైపు వెళతారనేది ప్రశ్నార్థకంగా మారింది.
Also Read : కాంగ్రెస్ నిర్వాకం బీజేపీకి బలం