భారతీయ జనతా పార్టీ చీఫ్ , కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ నిప్పులు చెరిగారు. ఆయన మరోసారి సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేశారు. శుక్రవారం బీజేపీ ఆధ్వర్యంలో సంగారెడ్డిలో నిరుద్యోగ మార్చ్ పేరుతో సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బండి సంజయ్ ప్రసంగించారు. రాష్ట్రంలో బీశ్వాల్ కమిటీ 2 లక్షల జాబ్స్ ఖాళీ ఉన్నాయని నివేదిక ఇచ్చిందని కానీ సీఎం కేసీఆర్ అసెంబ్లీలో కేవలం 88 వేల పోస్టులు మాత్రమే ఉన్నాయని అబద్దం చెప్పాడని ఆరోపించారు.
పరిపాలన గాడి తప్పిందని , టెక్నాలజీ ఉన్నా అవినీతి , అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోయిందన్నారు. ఇప్పటి వరకు ఒక్క పరీక్ష సరిగా నిర్వహించిన పాపాన పోలేదన్నారు. వేలకు వేల రూపాయలు ఖర్చు చేసినా పోస్టులు రాక పోవడంతో నిరుద్యోగగులు మానసికంగా తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన ఫ్యామిలీలో అందరికీ జాబ్స్ ఉన్నాయని కానీ 30 లక్షల మంది నిరుద్యోగులకు చేసేందుకు ఒక్క పోస్టు కూడా భర్తీ చేసిన పాపాన పోలేదన్నారు.
ఈ మాయల మరాఠి సీఎం కేసీఆర్ గద్దె దిగి పోతే కానీ రాష్ట్రం బాగు పడదన్నారు. నిరుద్యోగులకు కొలువులు రానే రావంటూ స్పష్టం చేశారు. అందుకే బీజేపీకి పట్టం కట్టాలని ఆయన పిలుపునిచ్చారు. ఇదే సమయంలో మరో కీలక ప్రకటన చేశారు బండి సంజయ్ . 14న హనుమాన్ జయంతి సందర్భంగా ర్యాలీ ఉంటుందన్నారు.
