CM KCR : అప్ర‌మ‌త్తంగా ఉండండి భ‌రోసా ఇవ్వండి – సీఎం

ఉన్న‌తాధికారులు..ప్ర‌జాప్ర‌తినిధుల‌కు ఆదేశం

CM KCR : అల్ప పీడ‌న ద్రోణి ఒడిశా మీదుగా ప్ర‌భావం చూప‌డంతో భారీ ఎత్తున వ‌ర్షాలు ముంచెత్తుతున్నాయి. కుండ పోతగా కురుస్తున్న వ‌ర్షాల తాకిడికి జ‌నం బెంబేలెత్తి పోతున్నారు.

వాగులు, వంక‌లు, న‌దులు పొంగి పొర్లుతున్నాయి. చెరువులు మ‌త్తడి దుంకుతున్నాయి. గోదావ‌రి, కృష్ణ‌మ్మ పొంగి పొర్లుతోంది. ఎక్క‌డ చూసినా నీళ్లే. ప‌రిస్థితి చేయి దాటి పోకుండా ఉండేందుకు ప్ర‌భుత్వ యంత్రాంగం అప్ర‌మ‌త్త‌మైంది.

స‌హాయక చ‌ర్య‌లలో మునిగి పోయింది. ఏ ఒక్క‌రు అవ‌స‌ర‌మైతే త‌ప్పా బ‌య‌ట‌కు రావ‌ద్దంటూ హెచ్చ‌రిక‌లు జారీ చేసింది తెలంగాణ స‌ర్కార్. ప‌రిస్థితిని ఎప్ప‌టిక‌ప్పుడు అంచ‌నా వేస్తూ సూచ‌న‌లు ఇస్తున్నారు సీఎం కేసీఆర్(CM KCR).

వ‌ర‌ద‌లు, వ‌ర్షాల తాకిడిపై సీఎం స‌మీక్ష చేప‌ట్టారు. త్ర‌యంబకేశ్వ‌రం నుంచి బంగాళాఖాతం వ‌ర‌కు గోదావ‌రి ప‌ర‌వ‌ళ్లు తొక్కుతోంది. ఉప న‌దుల‌న్నీ అలుగు పారుతున్నాయి.

అత్య‌వ‌స‌ర శాఖ‌ల‌కు చెందిన వారంతా ఉన్న చోట‌నే ఉండాల‌ని ఆదేశించారు కేసీఆర్. ప్ర‌జ‌లు అవ‌స‌ర‌మైతే త‌ప్ప బ‌య‌ట‌కు రావ‌ద్దంటూ సూచించారు.

జిల్లా క‌లెక్ట‌ర్లు, ప్ర‌జా ప్ర‌తినిధులు బాధితుల‌కు అండ‌గా నిల‌వాల‌ని అన్నారు. ఏ ఒక్క‌రూ ఇబ్బంది ప‌డ‌డానికి వీలు లేద‌న్నారు. ప్ర‌భుత్వం బాధితుల‌కు భ‌రోసా క‌ల్పిస్తుంద‌న్నారు.

ఎగువ నుంచి వ‌చ్చే వ‌ర‌ద‌ను ఎట్టి ప‌రిస్థితుల్లో ఆప వ‌ద్ద‌ని స్ప‌ష్టం చేశారు సీఎం(CM KCR). అన్ని శాఖ‌ల అధికారులు స‌మ‌న్వ‌యం చేసుకుని ముందుకు క‌ద‌లాల‌ని సూచించారు కేసీఆర్.

ఇది మ‌న ప‌నితీరుకు ప‌రీక్షా కాలం. అప్ర‌మ‌త్త‌త‌తో ఉండాలి. ఎప్ప‌టిక‌ప్పుడు ప‌రిస్థితిని అంచ‌నా వేయాలి. ముంపు బాధితుల‌ను సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించాల‌ని ఆదేశించారు సీఎం.

Also Read : దేశాభివృద్ధిలో యువ‌త కీల‌కం – కేటీఆర్

Leave A Reply

Your Email Id will not be published!