Bharata Ratna : భారతదేశ ఉత్తమ అవార్డు “భారత రత్న”

India's Best Award "Bharat Ratna"

Bharata Ratna : “భారతరత్న పురస్కారం” భారతదేశంలోని పౌరులకు అందే “అత్యుత్తమ పురస్కారం”.ఈ అవార్డు జనవరి 2, 1954లో భారతదేశ మొదటి రాష్ట్రపతి డా. రాజేంద్ర ప్రసాద్ గారిచే ప్రారంభించబడింది. ఈ పౌర పురస్కారం కళలు, సాహిత్యమ్, విజ్ఞానం మరియు క్రీడా రంగాలలో అత్యుత్తమ కృషి చేసిన వారికి ప్రదానం చేస్తారు. ఇప్పటివరకు నలభై అయిదు మందికి ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. వారిలో ఇద్దరు విదేశీయులు కూడా ఉన్నారు. ఈ పురస్కారం 1977 జూలై 13 నుండి 1980 జనవరి 26 వరకు జనతా పార్టీ పాలనలో కొద్దికాలం పాటు నిలిపివేయబడింది. ఒకే ఒక్కసారి 1992లో సుభాష్ చంద్రబోసుకు ప్రకటించబడిన పురస్కారం చట్టబద్ధ మరియు సాంకేతిక కారణాల వల్ల వెనుకకు తీసుకొనబడింది. మొదటగా1954 లో చక్రవర్తి రాజగోపాలాచారి,సర్వేపల్లి రాధాకృష్ణన్,చంద్రశేఖర వేంకట రామన్ గార్లకు బహుకరించబడింది.

చివరిగా అంటే 2019 సంవత్సరమునకు నానాజీ ధేశ్ ముఖ్ (మరణానంతరం),ప్రణబ్ ముఖర్జీ,భూపేన్ హాజరికా (మరణాంతరం) లకు బహుకరించ బడ్డది.

భారతరత్న నియమావళి మరియు పతకం గురించి పరిశీలిస్తే,.
ప్రతి సంవత్సరం జనవరి 26వ తేదీన జరిగే భారత గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఇచ్చే అవార్డులలో భారతదేశానికి సంబంధించినంత వరకు ‘భారత రత్న’ అత్యున్నత స్థాయికి చెందినట్టిది. శాస్త్ర, సాహిత్య వైద్య, శాంతి రంగాలలో “నోబెల్ బహుమతికి” ఎంత విశిష్టత ఉన్నదో భారతదేశానికి సంబంధించినంత వరకు ‘భారతరత్నకు” అంత విశిష్టత ఉన్నది.

భారత రత్న పతకం,కాంస్య లోహంతో తయారుచేయబడి రావి ఆకు ఆకారంలో ఉంటుంది. దాని పొడవు 2 అంగుళాలు (5.8 సెం.మీ) ఉంటుంది. 4 అంగుళాల (4.7 సెం.మీ.) వెడల్పు (గరిష్ట వెడల్పు ఉన్నచోట) ఉంటుంది. 1/8 అంగుళాల (3.1 మి.మీ) మందంతో ఉంటుంది. మొదటివైపు సూర్యుని ప్రతిబింబం ఉబ్బెత్తుగా చెక్కబడి ఉంటుంది. ఈ సూర్యప్రతిమ వ్యాసము 5/8 అంగుళాల (1.6 సెం.మీ) పరిమాణంలో ఉండి, సూర్యబింబం చుట్టూ కాంతికిరణాలు వ్యాపిస్తున్నట్లుగా ఉండి, 5/16 అంగుళాల నుంచి అరఅంగుళం పొడవులో కేంద్రం నుంచి ఉండి, సూర్య ప్రతిమ క్రింద భారతరత్న అని దేవనాగరిలిపి (భారతదేశపు జాతీయ భాష హిందీలిపి)లో చెక్కబడి ఉంటుంది. ఈ అక్షరాలు ఉబ్బెత్తుగా ఉంటాయి.
రెండవవైపున జాతీయ చిహ్నము, మూడు తలలున్న సింహపీఠము, దాని క్రింద “సత్యమేవ జయతే’ అనే జాతీయసూక్తి “దేవనాగరి” లిపిలో చెక్కబడి ఉంటుంది. జాతీయ చిహ్నమైన మూడుతలల సింహపీఠము, సూర్యుడు చుట్టూ ఉండే అంచు ప్లాటినమ్ లోహంతో ఉండగా అక్షరాలు మాత్రం ప్రకాశవంతంగా ఉంటాయి.మెడలో వేయడానికి వీలుగా రెండు ఇంచుల వెడల్పు గల తెలుపు రిబ్బన్ ను పతకానికి కడతారు.భారత రత్న పతకాలను కలకత్తా లోని “అలిపోర్” ప్రభుత్వ ముద్రణాశాలలో ముద్రిస్తారు.పద్మవిభూషణ్,పద్మ భూషణ్,పద్మశ్రీ,పరమవీరచక్ర లాంటి పురస్కారాలకు ఇచ్చే పతకాలను కూడా ఇక్కడే ముద్రిస్తారు.

ఈ ప్రతిష్టాత్మక బిరుదు ప్రదానాన్ని ఎవరికి ఇవ్వాలో నిర్దేశించే రాష్ట్రపతి ప్రకటన ద్వారా తెలియ చేయబడుతుంది. ఆ ఉత్తరువుపై దేశాధ్యక్షుని సంతకం మరియు ముద్ర ఉంటాయి.
ఎలాంటి జాతి, ఉద్యోగం,స్థాయి లేదా స్త్రీ పురుష వ్యత్యాసం లేకుండా ఈ పురస్కారం ఇవ్వబడుతుంది. ఈ పురస్కారగ్రహీతల జాబితాను ప్రధానమంత్రి, రాష్ట్రపతికి సిఫారసు చేయవలసి ఉంటుంది. ఈ గౌరవం వలన ఎలాంటీ అధికారాలు లేదా పేరు ముందు ప్రత్యేక బిరుదులూ రావు.అయినప్పటికీ అత్యున్నత అవార్డుగా పేరుంది.

1954, జనవరి 2వ తేదీన రెండు పౌర పురస్కారాలను ప్రారంభిస్తున్నట్లు భారత రాష్ట్రపతి యొక్క కార్యదర్శి కార్యాలయం నుండి ఒక ప్రకటన జారీ అయ్యింది. వాటిలో మొదటిది అత్యున్నత పౌర పురస్కారం “భారతరత్న” కాగా రెండవది దానికన్నా తక్కువ స్థాయి గల మూడంచెల “పద్మవిభూషణ్ పురస్కారం.1955, జనవరి 15న పద్మవిభూషణ్ పురస్కారాన్ని పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అనే మూడు వేర్వేరు పురస్కారాలుగా పునర్వర్గీకరించారు.

భారతరత్న పురస్కారం కేవలం భారతీయులకే ప్రదానం చేయాలన్న నిబంధన ఏమీ లేదు. ఈ పురస్కారాన్ని భారత పౌరసత్వం స్వీకరించిన “మదర్ థెరీసా”కు 1980లో, మరో ఇద్దరు విదేశీయులు “ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్‌కు” 1987లో, “నెల్సన్ మండేలాకు” 1990లో ప్రదానం చేశారు. ప్రఖ్యాత క్రికెట్ క్రీడాకారుడు “సచిన్ టెండూల్కర్‌కు” తన 40వ యేట ఈ పురస్కారం లభించింది. ఈ పురస్కారం లభించినవారిలో ఇతనే అతి పిన్నవయస్కుడు మరియు మొట్టమొదటి క్రీడాకారుడు. సాధారణంగా భారతరత్న పురస్కార ప్రదాన సభ రాష్ట్రపతి భవన్, ఢిల్లీలో జరుగుతుంది. కానీ 1958, ఏప్రిల్ 18వ తేదీన బొంబాయిలో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో ధొండొ కేశవ కర్వేకు అతని 100వ జన్మదినం సందర్భంగా ఈ పురస్కారాన్ని అందజేశారు. ఇతడు జీవించి ఉండగా ఈ పురస్కారం అందుకున్నవారిలో అతి పెద్ద వయస్కుడు.

చరిత్రలో ఈ పురస్కారం రెండుసార్లు రద్దు చేయబడింది. మొదటి సారి మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రిగా గద్దెనెక్కిన తర్వాత 1977, జూలై 13వ తేదీన అన్ని పౌరపురస్కారాలను రద్దుచేశారు. తరువాత ఈ పురస్కారాలు 1980, జనవరి 25న ఇందిరాగాంధీ ప్రధాన మంత్రి అయిన తర్వాత పునరుద్ధరించబడ్డాయి. 1992లో ఈ పురస్కారాల “రాజ్యాంగ సాధికారత”ను సవాలు చేస్తూ కేరళ, మధ్యప్రదేశ్ హైకోర్టులలో రెండు ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలు కావడంతో ఈ పురస్కారాలను రెండవసారి రద్దు చేశారు. ఈ వ్యాజ్యాలకు ముగింపు పలుకుతూ 1995 డిసెంబరులో సుప్రీం కోర్టు ఈ పురస్కారాలను మళ్ళీ పునరుద్ధరించింది.

ఈ పతక ప్రదానము పొందిన వ్యక్తుల పేర్లు భారతదేశ గెజిట్ (రాజపత్రము)లో ప్రకటించి, అట్టి పేర్లను ఒక రిజిస్టరు పుస్తకములో నమోదుచేసి ఆ రిజిస్టరును దేశాధ్యక్షుని సూచనలు ప్రకారము నిర్వహిస్తారు.
కొన్ని ప్రత్యేక సందర్భములలో ధరించవలసిన ఈ పతకము యొక్క నమూనా పతకము అసలు పతక పరిమాణములో “సగము” పరిమాణములో ఉండవలెను.దేశాధ్యక్షుడు ఏవ్యక్తికైనాఇచ్చిన పతకమును రద్దుపరచవచ్చును లేక ఇచ్చుట నిలిపి వేయవచ్చును. అలా జరిగితే ఆ వ్యక్తి యొక్క పేరు రిజిస్టరు నుంచి తొలగిస్తారు.మన దేశ అత్యున్నత అవార్డును ఈ సంవత్సరం ఎవరుఅందుకుంటారో వేచిచూద్దాం.
ప్రతి సంవత్సరం గణతంత్ర వేడుకల్లో ప్రదానం చేయనున్న భారత రత్న అవార్డు 2021 జనవరి లో ప్రదానం చేయనున్న “2020 భారత రత్న అవార్డు” ఎవరిని వరిస్తుందో చూద్దాం.ఈ అవార్డు అత్యున్నత అవార్డు కావడం వల్ల చాలా ప్రాధాన్యత సంతరించుకుంది.

No comment allowed please