#SonuSood : సోనూ సూద్ పై బిఎంసీ ఘాటు వ్యాఖ్య‌లు

నోటీసులు ఇచ్చినా స్పందించ‌డం లేద‌న్న బీఎంసీ

Sonu Sood : దేశ వ్యాప్తంగా రీల్ హీరో కాద‌ని రియ‌ల్ హీరో అంటూ ల‌క్ష‌లాది మందితో నీరాజానాలు అందుకుంటున్న సోనూసూద్ పై బృహ‌న్ ముంబై మున్సిపల్ కార్పొరేష‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. ఆయ‌న నేరాలు చేసేందుకు అల‌వాటు ప‌డ్డాడంటూ ఆరోపించింది. ఎన్ని సార్లు చెప్పినా సోనూ సూద్ త‌న వైఖ‌రి మార్చు కోవ‌డం లేదంటూ మండి ప‌డింది. అక్ర‌మ నిర్మాణాలు చేప‌డుతున్న ఆయ‌న‌కు మాట్లాడే హ‌క్కు లేద‌ని పేర్కొంది.ఒక బాధ్య‌త క‌లిగిన వ్య‌క్తిగా స్పందించ‌క పోవ‌డం బాధాక‌ర‌మ‌ని పేర్కొంది.

నివాస స‌ముదాయాన్ని హోట‌ల్‌గా మార్చార‌ని, చ‌ట్ట విరుద్ధంగా క‌మ‌ర్షియ‌ల్ ప‌రంగా లాభాలు పొందాల‌ని చూస్తున్నారంటూ ఘాటుగా విమ‌ర్శించింది. ఇప్ప‌టి వ‌ర‌కు తాము కొంత మేర నిర్మాణాలు కూల్చి వేశామ‌ని, లైసెన్సు శాఖ ప‌ర్మిష‌న్ తీసుకోకుండానే తిరిగి పున‌ర్ నిర్మాణం మొద‌లు పెట్టారంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ఈ మేర‌కు సోనూ సూద్ పై బాంబే హైకోర్టులో బీఎంసీ అఫిడ‌విట్ దాఖ‌లు చేసింది. జుహూ ప్రాంతంలో శ‌క్తి సాగ‌ర్ పేరుతో ఆరంత‌స్తుల బిల్డింగ్ ఉంది.

ప‌ర్మిష‌న్ తీసుకోకుండా హోట‌ల్ గా మార్చారంటూ నోటీసులు పంపించింది. సోనూ సూద్ ఇంత వ‌ర‌కు స్పందించ లేదంటూ పేర్కొంది. కాగా తాను అన్ని అనుమ‌తులు తీసుకున్నాన‌ని, బీఎంసీ లేవ‌నెత్తిన అభ్యంత‌రాల‌ను స‌వాల్ చేస్తూ కోర్టును ఆశ్ర‌యించారు సోనూ. దిగువ కోర్టు ఆ అభ్య‌ర్థ‌న‌ను నిరాక‌రించ‌డంతో, హైకోర్టుకు వెళ్లారు. స్పందించిన కోర్టు వివ‌ర‌ణ ఇవ్వాల్సిందిగా బిఎంసీని ఆదేశించింది. దీంతో బీఎంసీ తీవ్ర ఆరోప‌ణ‌లు గుప్పించింది.

No comment allowed please