బహుజన్ సమాజ్ పార్టీ తెలంగాణ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ షాకింగ్ కామెంట్స్ చేశారు. విద్యుత్ శాఖలో కొన్నేళ్ల పాటు పని చేస్తూ వస్తున్న ఆర్టిజన్ విద్యుత్ ఉద్యోగులు చేస్తున్న సమ్మెకు తాము బేషరతుగా మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా బీఎస్పీ అన్ని రకాలుగా వెన్నంటి ఉంటామని పేర్కొన్నారు ఆర్ఎస్పీ.
రాష్ట్రంలోని 23 వేల ఆర్టిజన్ విద్యుత్ ఉద్యోగులపై బీఆర్ఎస్ ప్రభుత్వం బల ప్రయోగం చేస్తోందని ఆరోపించారు. గత మూడు రోజులుగా పోలీసులు వారిని భయ భ్రాంతులకు గురి చేస్తున్నారని, కేసులు పెడతామని, జైళ్లోకి తోస్తామంటూ టార్చర్ కు గురి చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.
ఒప్పంద కార్మికులను ఆర్టిజన్ కార్మికులుగా మార్చారని, ఆ తర్వాత వదిలి వేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఫామ్ హౌస్ కే పరిమితమైన సీఎం ఉండడం వల్ల ప్రధాన సమస్యలు పరిష్కారానికి నోచు కోవడం లేదన్నారు. ఆర్టిజన్ కార్మికులకు కనీస వేతనం ఇవ్వడం లేదని, ఉద్యోగ భద్రత కరువైందని ఆరోపించారు.
విద్యుత్ సంస్థల్లో పోల్స్ ఎక్కుతున్నారని, ప్రమాదకర పరిస్థితుల్లో పని చేస్తున్నారని వారిని వెంటనే పర్మినెంట్ చేయాలని డిమండ్ చేశారు. సమ్మె చేయడం ప్రతి ఒక్కరి హక్కు అని ఎలా అరెస్ట్ చేస్తారంటూ ప్రశ్నించారు .