న్యూఢిల్లీ : కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. ఆదివారం సీఈసీ ఆయా రాష్ట్రాలలో నిర్వహించే ఎన్నికలకు సంబంధించి ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించింది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో రెండు విడతలుగా పోలింగ్ జరగనుంది. ఏప్రిల్ 9న అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఎన్నికలు జరుగుతాయి. ఏప్రిల్ 23 నుండి పశ్చిమ బెంగాల్ ,తమిళనాడు రాష్ట్రాలలో పోలింగ్ జరగనుంది. నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలోని మొత్తం 824 స్థానాలకు ఓట్ల లెక్కింపు మే 4న జరగనుందని కేంద్ర ఎన్నికల కమిషనర్ వెల్లడించారు. అస్సాం, కేరళ ,పుదుచ్చేరిలకు అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ 9న ఒకే దశలో జరుగుతాయి. పశ్చిమ బెంగాల్, తమిళనాడుకు ఎన్నికలు ఏప్రిల్ 23 నుండి దశల వారీగా నిర్వహించబడతాయి. ఫలితాలు కూడా అదే రోజున ప్రకటించ బడతాయి.
పశ్చిమ బెంగాల్లో ఏప్రిల్ 23, ఏప్రిల్ 29 తేదీలలో రెండు దశల్లో ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికలు నిష్పాక్షికంగా , హింస లేకుండా జరిగేలా చూసుకోవాలని ఎన్నికల కమిషన్ అన్ని అమలు సంస్థలను కోరింది. ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటనలో ఎన్నికల కమిషన్ ఎక్కువ పారదర్శకతను నిర్ధారిస్తుందని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ అన్నారు. అన్ని పోలింగ్ బూత్‌లలోని ప్రిసైడింగ్ అధికారులు ప్రతి 2 గంటలకు , ఓటింగ్ ముగిసిన వెంటనే ఓటర్ల ఓటింగ్ డేటాను అప్లోడ్ చేస్తారని తెలిపారు. అస్సాం, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు , పశ్చిమ బెంగాల్‌లలో పోలింగ్ స్టేషన్‌కు సగటున 750-900 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు సీఈసీ.
నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలోని 2.19 లక్షల పోలింగ్ కేంద్రాలలో ఏప్రిల్ 9న పోలింగ్ జరుగుతుంది. ఎన్నికల సమయంలో 25 లక్షలకు పైగా ఎన్నికల అధికారులు విధుల్లో ఉంటారు. 824 నియోజకవర్గాలు కలిగిన ఐదు అసెంబ్లీలలో జరిగే ఎన్నికలలో మొత్తం 17.4 కోట్ల మంది ఓటర్లు ఓటు వేయడానికి అర్హులు.
