Chennai High Court: తమిళం రాయడం, చదవడం వచ్చిన వారికే ప్రభుత్వ ఉద్యోగం – హైకోర్టు
తమిళం రాయడం, చదవడం వచ్చిన వారికే ప్రభుత్వ ఉద్యోగం - హైకోర్టు
Chennai High Court: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగంలో చేరాలంటే తమిళం రాయడం, చదవడం తప్పనిసరి అని తమిళనాడు హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ మేరకు తమిళనాడు ప్రభుత్వ ఉద్యోగంలో చేరాలంటే తమిళంలో మాట్లాడడం, రాయడం తెలిసి ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. తమిళనాడులోని ప్రభుత్వ ఉద్యోగులకు తమిళం తెలియకపోతే ఎలా… అతను రోజువారీ విధులు ఎలా నిర్వహించగలడని ప్రశ్నించింది. 2022లో విద్యుత్ బోర్డులో జూనియర్ అసిస్టెంట్ గా చేరిన తాను రెండేళ్లలో తమిళ భాషా పరీక్షలో ఉత్తర్ణత కాకపోవడంతో తనను విధుల నుంచి తొలగించారని… ప్రస్తుతం తాను టీఎన్‌పీఎస్సీ నిర్వహించిన భాషా పరీక్ష పాసైనందున తనను మళ్లీ ఉద్యోగంలో చేర్చుకునేలా ఉత్తర్వులివ్వాలని కోరుతూ తేనికి చెందిన జయకుమార్ హైకోర్టును(Chennai High Court) ఆశ్రయించగా… సింగిల్ జడ్జి అతడికి అనుకూలంగా తీర్పునిచ్చారు.
Chennai High Court Orders
దీనిని సవాల్ చేస్తూ విద్యుత్ బోర్డు ద్విసభ్య ధర్మాసనం ముందు అప్పీలు చేసింది. న్యాయమూర్తులు జస్టిస్ జయచంద్రన్, జస్టిస్ పూర్ణిమతో కూడిన ధర్మాసనం ఆ అప్పీలుపై విచారణ జరిపింది. జయకుమార్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ… పిటిషనర్ తండ్రి నౌకాదళాధికారి కావడంతో వరుస బదిలీలు జరిగేవని… అందువల్ల అతను సీబీఎస్ఈ సిల్‌బస్ చదవాల్సి రావడంతో తమిళం నేర్చుకోలేకపోయాడన్నారు. ప్రస్తుతం తమిళ భాషా పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడని, అందువల్ల అతడ్ని విధుల్లోకి తీసుకోవాలని అభ్యర్థించారు.
దీనిపై ధర్మాసనం స్పందిస్తూ… తమిళనాడు ప్రభుత్వ ఉద్యోగంలో చేరాలంటే తమిళంలో మాట్లాడడం, రాయడం తెలిసి ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. తమిళనాడు లోని ప్రభుత్వ ఉద్యోగులకు తమిళం తెలియకపోతే ఎలా? అతను రోజువారీ విధులు ఎలా నిర్వహించగలడని ప్రశ్నించింది. ఏ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులైనా ఆ రాష్ట్ర భాష తెలిసి ఉండాలని అభిప్రాయపడింది. లేనిపక్షంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే భాషా పరీక్షలో నిర్దేశిత వ్యవధిలో ఉత్తీర్ణులై ఉండాలని పేర్కొంది. రాష్ట్ర అధికార భాష తెలియకుండా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎలా ఆశపడతారని ప్రశ్నిస్తూ.. సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును నిలుపుదల చేసింది. తదుపరి విచారణ వాయిదా వేసింది.
Also Read : ED Raids: ఛత్తీస్ గఢ్ మాజీ సీఎం ఇంట్లో ఈడీ సోదాలు !