Chevireddy Mohit Reddy: చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అదుపులోనికి తీసుకుని నోటీసులు జారీ చేసిన పోలీసులు !
చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అదుపులోనికి తీసుకుని నోటీసులు జారీ చేసిన పోలీసులు !
Chevireddy Mohit Reddy: చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానిపై హత్యాయత్నం కేసులో వైసీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి తనయుడు చెవిరెడ్డి మోహిత్‌రెడ్డిని పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. శనివారం రాత్రి దుబాయ్ వెళ్లబోతున్న ఆయనను తిరుపతి డీఎస్పీ రవిమనోహరాచారి నేతృత్వంలోని బృందం బెంగళూరు విమానాశ్రయంలో అదుపులోనికి తీసుకుంది. ఆదివారం ఉదయం తిరుపతిలోని ఎస్వీయూ పీఎస్ కు తీసుకొచ్చారు. కాసేపు విచారించిన అనంతరం 41ఏ నోటీసులు ఇచ్చి విడిచిపెట్టారు. అయితే అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లకూడదని పోలీసులు షరతులు విధించారు. ఈ సందర్భంగా పీఎస్ వద్ద మోహిత్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ అక్రమంగా తమపై కేసులు పెట్టారని.. దీనిపై న్యాయస్థానంలో పోరాడతామని చెప్పారు.
ఇటీవలి సార్వత్రిక ఎన్నికల సమయంలో చంద్రగిరి నియోజకవర్గ పరిధిలో పెద్దఎత్తున అల్లర్లు చెలరేగాయి. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యాక తిరుపతిలోని శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్‌రూంల పరిశీలనకు వెళ్లిన చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై హత్యాయత్నం జరిగింది. నాటి వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి, ఆయన తనయుడు వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి మోహిత్‌రెడ్డి(Chevireddy Mohit Reddy)కి చెందిన అనుచరులు భానుకుమార్‌రెడ్డి, గణపతితోపాటు పలువురు దాడి చేశారు. మారణాయుధాలు, రాళ్లు, బీరు సీసాలతో దాడికి తెగబడ్డారు. నానితోపాటు ఆయన డ్రైవర్, గన్‌మెన్‌పై సుత్తితో విచక్షణా రహితంగా దాడిచేశారు. గన్‌మెన్ తేరుకుని గాల్లోకి కాల్పులు జరపగా నిందితులు పరారయ్యారు. ఘటనలో పులివర్తి నాని భుజం, కాలికి.. గన్‌మెన్ తలకు గాయాలయ్యాయి.
ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారడంతో అల్లర్లపై నివేదిక కోరుతూ అప్పట్లో రాష్ట్ర ఎన్నికల సంఘం… సిట్ ఏర్పాటు చేసింది. తొలుత 16 మంది నిందితులను గుర్తించి 15 మందిని అరెస్టు చేశారు. తర్వాత 37 మంది నిందితులు ఉన్నట్లు గుర్తించారు. 34 మందిని అరెస్టు చేశారు. 37వ నిందితుడిగా మోహిత్‌రెడ్డి(Chevireddy Mohit Reddy) పేరును చేర్చిన నేపథ్యంలో ఆయన ఇటీవల ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించగా అక్కడ చుక్కెదురైంది. ఇప్పటికే ఈ కేసులో 34 మందిని అరెస్టుచేశారు. ఈ కేసులో 37వ నిందితుడిగా ఉన్న చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని తాజాగా అదుపులోనికి తీసుకుని 41ఏ నోటీసులు ఇచ్చి విడిచిపెట్టారు.
Chevireddy Mohit Reddy – మోహిత్ రెడ్డి పై లుక్ అవుట్ నోటీసులు జారీ !
దాడికి ప్రధాన సూత్రధారి మోహిత్ రెడ్డి(Chevireddy Mohit Reddy) అని పేర్కొంటూ పులివర్తి నాని ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఎఫ్‌ఐఆర్‌లో ఆయన పేరును పోలీసులు చేర్చారు. విదేశాలకు పారిపోకుండా లుక్‌అవుట్ నోటీసులు జారీచేశారు. శనివారం బెంగళూరు నుంచి దుబాయ్ వెళ్లబోతుండగా విమానాశ్రయ భద్రతా సిబ్బంది గుర్తించి, స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు తిరుపతి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వెళ్లి అదుపులోనికి తీసుకున్నారు.
రాజకీయ కక్షతోనే నా కొడుకుపై కేసు – చెవిరెడ్డి భాస్కరరెడ్డి
‘లండన్‌లోని లార్విక్ లాంటి ప్రఖ్యాత విశ్వవిద్యాలయంలో చదువుకుని వచ్చిన నా కుమారుడు మోహిత్ రెడ్డి(Chevireddy Mohit Reddy)ని సంబంధం లేని కేసులో ఇరికించడం ద్వారా అతడ్ని వీధిలోకి లాగారు. వీధి పోరాటాలకే కాదు… అన్నింటికీ మేం సిద్ధమే’ అని మోహిత్ తండ్రి, వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి అన్నారు. రెండు నెలల కిందట ఘటన జరిగితే ఇప్పుడు కేసు పెట్టి… అందులో నా కుమారుణ్ని ఏ37గా ఇరికించారని ఆరోపించారు. మోహిత్‌రెడ్డిని తిరుపతి పోలీసులు బెంగళూరు విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో భాస్కరరెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు.
‘నా కుమారుడి వయసు పాతికేళ్లు. విదేశాల్లో ఉన్నత విద్యనభ్యసించి, ఇప్పుడు ప్రజాజీవితంలోకి వచ్చాడు. అక్రమ కేసులో అరెస్టుచేసి, తనను వీధి పోరాటానికి సిద్ధం చేస్తున్నారు. ఇందుకు చంద్రబాబుకు కృతజ్ఞతలు. నా బిడ్డ తన ప్రజా పోరాటాలు ఎలా ఉంటాయో ఈ ప్రభుత్వానికి, పోలీసు అధికారులకు రుచి చూపిస్తాడు’ అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఇంటి దగ్గరున్నప్పుడు కాకుండా దుబాయ్‌లో స్నేహితుడి వివాహానికి హాజరయ్యేందుకు వెళుతున్న నా కుమారుణ్ని పోలీసులు బెంగళూరు విమానాశ్రయంలో అదుపులో తీసుకుని హంగామా సృష్టించడం ఎవరి మెప్పు కోసం అని ప్రశ్నించారు.
Also Read : BJP Meeting : బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంలతో భేటీ అయిన అధిష్టానం