CM Bhupesh Baghel : గవర్నర్ అనసూయపై సీఎం గుస్సా
రాజ్యాంగ పరిధి దాటుతోందని ఫైర్
CM Bhupesh Baghel : ఛత్తీస్ గఢ్ సీఎం భూపేష్ బఘేల్(CM Bhupesh Baghel) షాకింగ్ కామెంట్స్ చేశారు. రాష్ట్ర గవర్నర్ అనసూయపై నిప్పులు చెరిగారు. ఆమె రాజ్యాంగ పరిధిని దాటి వ్యవహరిస్తోందంటూ ఆరోపించారు సీఎం. ఇదిలా ఉండగా రిజర్వేషన్ల సవరణలకు సంబంధించి జారీ చేసిన రెండు బిల్లులపై ప్రభుత్వాన్ని వివరణ కోరడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు.
ఒకవేళ ఏమైనా అనుమానాలు ఉంటే బిల్లులను ఆమోదించాలి లేదా తిరస్కరించాలని స్పష్టం చేశారు. కానీ ఇలా వ్యవహరించడం సబబు కాదని సూచించారు గవర్నర్ అనసూయకు సీఎం భూపేష్ బఘేల్.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జన్ అధికార్ మహా ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు సీఎం. భారత రాజ్యాంగం శాసన వ్యవస్థ, కార్య నిర్వాహక , న్యాయ వ్యవస్థలకు స్పష్టమైన బాధ్యతలు, పరిధిని నిర్ణయించిందన్నారు భూపేష్ బఘేల్(CM Bhupesh Baghel).
గవర్నర్ ఇవేవీ పట్టించుకోకుండా తన పరిధి తెలుసు కోకుండా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు. శాసన సభ ఆమోదించిన బిల్లులను ఆమోదించే అధికారంతో పాటు తిరస్కరించే హక్కు కూడా ఉంటుందన్నారు. కానీ ప్రశ్నించి, సదరు బిల్లులను నిలిపి వేసే హక్కు లేదన్నారు ఛత్తీస్ గఢ్ సీఎం.
ఇందుకు సంబంధించి రాజ్యాంగం లోని ఆర్టికల్ 200 స్పష్టం చేస్తుందని ఆయన పేర్కొన్నారు. ఇకనైనా గవర్నర్ తన పరిమితులేమిటో తెలుసుకుని ప్రవర్తించాలని ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం.
ఇదిలా ఉండగా బీజేపీయేతర రాష్ట్రాలలో గవర్నర్ల పంచాయతీ కొనసాగుతూనే ఉంది. తమిళనాడు, కేరళ, తెలంగాణ, పశ్చిమ బెంగాల్ , జార్ఖండ్ , పంజాబ్ రాష్ట్రాలలో ఆధిపత్య పోరు నడుస్తోంది.
Also Read : రద్దు తర్వాత పెరిగిన నోట్ల చలామణి