కన్నడ నాట ఎన్నికలు ముగిశాయి. 224 స్థానాలకు సంబంధించి పోలింగ్ జరిగింది. మొత్తం 2,516 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇక పోలింగ్ పూర్తి కావడంతో ఎగ్జిట్ పోల్స్ బయటకు వచ్చాయి. మొత్తం 10 న్యూస్ ఛానల్స్, వివిధ సర్వే సంస్థలు కలిసి నిన్న ప్రకటించాయి. ఇందులో రెండు మాత్రం కాంగ్రెస్ పార్టీకి పూర్తి మెజారిటీ వస్తాయని వెల్లడించాయి. మిగతా వాటిలో ఒక సంస్థ భారతీయ జనతా పార్టీ పూర్తి ఆధిక్యం సాధిస్తుందని తెలిపింది.
మిగతా సంస్థలు పూర్తిగా హంగ్ కే ఛాన్స్ ఉందంటూ స్పష్టం చేశాయి. ఇదిలా ఉండగా తాము పవర్ లోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, మాజీ సీఎం సిద్దరామయ్య, కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్. కాగా ఎగ్జిట్ పోల్స్ ను పూర్తిగా కొట్టి పారేశారు కర్ణాటక సీఎం బస్వరాజ్ బొమ్మై.
తాము అద్భుతమైన పాలన అందించామని, ప్రజలు మరోసారి తమకే పట్టం కట్టడం ఖాయమని జోష్యం చెప్పారు కర్‌ణాటక సీఎం బస్వరాజ్ బొమ్మై. ఆయన ఎగ్జిట్ పోల్స్ అంచనాలను పూర్తిగా తప్పు పట్టారు. తాను వాటిని నమ్మనన్నారు. తాము చేపట్టిన అభివృద్ది పనులే తమను గట్టెక్కిస్తాయని స్పష్టం చేశారు. పోలింగ్ ముగిసిన అనంతరం సీఎం మీడియాతో మాట్లాడారు.
