TS CM KCR : కాషాయం దేశానికి ప్రమాదం – కేసీఆర్
కేంద్ర సర్కార్ వల్ల ఒనగూరిందేంటి
TS CM KCR : భారతీయ జనతా పార్టీపై ఊహించని రీతిలో నిప్పులు చెరిగారు సీఎం కేసీఆర్. తమకంటూ ఓ విజన్ ఉందని కానీ కేంద్రంలో కొలువు తీరిన నరేంద్ర మోదీకి ఎలాంటి నిబద్దత లేదని ధ్వజమెత్తారు.
ప్రగతి భవన్ లో కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. బీజేపీ వల్ల ఇప్పటి వరకు దేశానికి ఏం లాభం చేకూరిందో 133 కోట్ల ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు కేసీఆర్.
నన్ను తిట్టేందుకే జాతీయ కార్యవర్గ సమావేశాలు పెట్టారని అంతకు మించి వారు సాధించింది ఏమీ లేదని ఎద్దేవా చేశారు. మొత్తంగా కాషాయం అన్నది దేశానికి అత్యంత ప్రమాదకరమంగా తయారైందన్నారు.
కులం, ప్రాంతం, మతం పేరుతో మనుషుల మధ్య అంతరాలు సృష్టించడం, ఎన్నికలయ్యాక వాటిని మరిచి పోయేలా చేయడం ఆ పార్టీ సాధించింది అది ఒక్కటేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వరదలు, వర్షాల దెబ్బకు నానా ఇబ్బందులు పడుతున్నా ఈరోజు వరకు కేంద్రం నుంచి సాయం అందలేదని మండిపడ్డారు. ప్రధాని మాట్లాడిన మాటల్లో ఎలాంటి సరుకు లేదని ఎద్దేవా చేశారు కేసీఆర్(TS CM KCR).
ఓ వైపు ద్రవ్యోల్బణం, నిరుద్యోగం దేశాన్ని పట్టి పీడిస్తోందన్నారు. కానీ మోదీ మాత్రం తన వ్యక్తిగత ప్రచారంపైనే ఫోకస్ పెట్టడంతోనే సరి పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
దేశ రాజధాని ఢిల్లీలో విద్యుత్ కోతలు ఉన్నాయని, బీజేపీయేతర ప్రభుత్వాలను టార్గెట్ చేయడం దారుణమన్నారు. ఇది మంచి పద్దతి కాదని సూచించారు కేసీఆర్.
బీజేపీ విమర్శలు, ఆరోపణలకు తాము భయపడే ప్రసక్తి లేదన్నారు సీఎం. ప్రజలు కర్ర కాల్చి వాత పెట్టడం ఖాయమన్నారు. ఇకనైనా మేలుకోక పోతే శ్రీలంక లో చోటు చేసుకున్న పరిస్థితులే ఇక్కడా రిపీట్ కాక తప్పదన్నారు కేసీఆర్(TS CM KCR).
Also Read : కేంద్రంపై పోరాటం మోదీపై యుద్ధం