CM Nara Chandrababu Naidu: గుడివాడలో అన్న క్యాంటీన్ ప్రారంభించనున్న చంద్రబాబు !
గుడివాడలో అన్న క్యాంటీన్ ప్రారంభించనున్న చంద్రబాబు !
CM Nara Chandrababu Naidu: ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అన్న క్యాంటీన్ ను పున: ప్రారంభించడానికి సన్నద్దమయింది. ఐదు రూపాయలకే పేదవారి ఆకలి తీర్చే అన్న క్యాంటీన్ లను ఈ నెల 15న ప్రారంభించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. దీనిలో భాగంగా స్వాతంత్య్ర దినోత్సవం రోజున తొలి విడతగా 100 క్యాంటీన్ లు అందుబాటులోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పంద్రాగస్టున కృష్ణా జిల్లా గుడివాడలో సీఎం చంద్రబాబు(CM Nara Chandrababu Naidu) చేతుల మీదుగా అన్న క్యాంటీన్ ను ప్రారంభించడానికి ఏర్పాటు చేస్తున్నారు. గుడివాడ పట్టణంలో ఏర్పాటు చేసిన క్యాంటీన్‌ను సీఎం ప్రారంభించనున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడినందున ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఈ కార్యక్రమం వాయిదా పడింది. మిగతా జిల్లాల్లో ఎంపిక చేసిన 33 పురపాలక, నగరపాలక సంస్థల్లో క్యాంటీన్లు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎక్కడెక్కడ, ఎన్నెన్ని ఏర్పాటు చేయాలన్న విషయంలో పురపాలకశాఖ మంత్రి నారాయణ అధికారులతో చర్చించారు. 16వ తేదీ నుంచి ఈ క్యాంటీన్లు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తాయి.
CM Nara Chandrababu Naidu – అక్షయపాత్ర వంటశాలను పరిశీలించిన మంత్రి నారాయణ
గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరులోని అక్షయపాత్ర వంటశాలను మంత్రి నారాయణ పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ… అన్న క్యాంటీన్ లకు ఆహార పంపిణీ ఏర్పాట్లను పరిశీలించినట్టు చెప్పారు. ‘‘గతంలో రాష్ట్ర వ్యాప్తంగా 180 అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేసి రూ.5కే 4.60 కోట్ల భోజనాలు అందించాం. పరిశుభ్రమైన వాతావరణంలో మంచి భోజనం పేదలకు పెట్టాం. కానీ, వైసీపీ ప్రభుత్వం వచ్చాక అన్న క్యాంటీన్ లను మూసివేసింది. కూటమి ప్రభుత్వం రాగానే క్యాంటీన్ లు తెరవాలని నిర్ణయించాం. అన్న క్యాంటీన్ లకు ఆహార పంపిణీ కాంట్రాక్టు అక్షయపాత్ర దక్కించుకుంది. ఈనెల 15న గుడివాడలో అన్న క్యాంటీన్‌ను సీఎం చంద్రబాబు ప్రారంభిస్తారు. పట్టణ ప్రాంతాల్లో 180, గ్రామీణ ప్రాంతాల్లో 200కు పైగా క్యాంటీన్లు ప్రారంభించాలనేది ప్రణాళిక. పేద వర్గాలు ఎక్కువగా తిరిగే మార్కెట్లు, ఆసుపత్రుల వద్ద ఏర్పాటు చేస్తాం. అక్షయపాత్ర వంటశాల చాలా ఆధునికంగా, పరిశుభ్రంగా ఉంది’’ అని మంత్రి తెలిపారు.
Also Read : AP Government: తెలంగాణ ఉద్యోగులను రిలీవ్ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు !