CM Yogi Adityanath : హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళతాం
యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ వెల్లడి
CM Yogi Adityanath : యూపీ సీఎంకు కోలుకోలేని షాక్ ఇచ్చింది అలహాబాద్ హైకోర్టు. లక్నో బెంచ్ పౌర ఎన్నికలపై రాష్ట్ర ప్రభుత్వం తయారు చేసిన ముసాయిదా నోటిఫికేషన్ ను తిరస్కరించింది. ఓబీసీలకు రిజర్వేషన్ లేకుండా ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది. దీనిపై మంగళవారం స్పందించారు సీఎం యోగి ఆదిత్యానాథ్(CM Yogi Adityanath). పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓబీసీ రిజర్వేషన్ల అంశంపై నిర్ణయం తీసుకునేందుకు ప్రభుత్వం కమిషన్ ను ఏర్పాటు చేస్తుందని స్పష్టం చేశారు సీఎం.
అవసరమైతే హైకోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా ప్రభుత్వం సుప్రీంకోర్టును కూడా ఆశ్రయిస్తుందని చెప్పారు యోగి. ఎప్పుడో పట్టణ పౌర సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సి ఉందన్నారు. కానీ రిజర్వేషన్ల అంశం కారణంగా వాయిదా పడుతూ వస్తోందన్నారు సీఎం. కోర్టు ఆదేశాలపై న్యాయ నిపుణులను సంప్రదిస్తామన్నారు.
పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలపై తాము తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇదే విషయంపై డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఓబీసీ(OBC Reservations) హక్కుల విషయంలో తమ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు మౌర్య. ఇదిలా ఉండగా ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ ను సవాల్ చేస్తూ అనేక పిటిషన్లు దాఖలయ్యాయి.
కాగా తమ ప్రభుత్వం ఉన్నత న్యాయస్థానం సూచనలను పరిగణలోకి తీసుకుంటుందన్నారు సీఎం యోగి ఆదిత్యానాథ్. అయితే ఓబీసీల రాజకీయ వెనుకబాటుతనాన్ని అధ్యయనం చేసేందుకు ప్రత్యేక ప్యానెల్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. మొత్తంగా మరోసారి రిజర్వేషన్ల వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది.
Also Read : ప్రగ్యాపై కాంగ్రెస్ ఫైర్ బీజేపీ సెటైర్