UP CM Yogi : వరద పరిస్థితిపై సీఎం యోగి ఆరా
ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం
UP CM Yogi : ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో గత రెండు రోజులుగా వరదలు ముంచెత్తుతున్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ఈ మేరకు సహాయక చర్యలు చేపట్టాలని సీఎం యోగి ఆదిత్యానాథ్(UP CM Yogi) ఆదేశించారు. ఇందులో భాగంగా బుధవారం వరద పరిస్థితిపై ఉన్నత స్థాయి సమీక్ష చేపట్టారు.
రిలీఫ్ కమిషన్ కార్యాలయం నుండి వచ్చిన నివేదిక ప్రకారం రాష్ట్రంలోని 18 జిల్లాల్లో 1,370 గ్రామాలు వరదల బారిన పడ్డాయి. విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో సహాయక చర్యలు చేపట్టాలని ఎవరూ ఇబ్బందులు పడవద్దని స్పష్టం చేశారు సీఎం. తమ ఆధ్వర్యంలోని జిల్లాల్లో సహాయక చర్యలను పర్యవేక్షించాలని మంత్రలును ఆదేశించారు.
ప్రధానంగా ప్రభావిత ప్రాంతాల్లో సహాయ, పునరావాస పనులను వేగవంతం చేయాలని సూచించారు సీఎం. జాయింట్ మేజిస్ట్రేట్ స్థాయి అధికారి నేతృత్వంలో జిల్లా కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేయాలని, అవి 24 గంటల పాటు పని చేయాలని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా ఎడ తెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా జన జీవనం స్తంభించి పోయింది.
పశువులు, వ్యవసాయంపై ప్రతికూల ప్రభావం కనిపిస్తోంది. పలు జిల్లాల్లో ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులకు భారీగా నష్టం వాటిల్లిందని సీఎం తెలిపారు. కాగా బాధిత ప్రజలందరికీ భద్రత, నిర్వహణ కోసం అవసరమైన ఏర్పాట్లు చేసేందుకు తమ ప్రభుత్వం కట్టుబడ ఉందని స్పష్టం చేశారు యోగి ఆదిత్యానాథ్.
మరో వైపు రాష్ట్రంలో అధిక వర్షాల కారణంగా ఇప్పటి వరకు ముగ్గురు మరణించారు. పిడుగుపాటు, పాము కాటు, మునిగి పోవడం వల్ల ఒక్కొక్కరు ప్రాణాలు కోల్పోయారు. మృతుల కుటుంబాలకు తక్షణ సాయం చేయాలని ఆదేశించారు సీఎం.
Also Read : ‘ఇందిరా రసోయ్’ ని రుచి చూడండి – సీఎం