Dasoju Sravan : కాంగ్రెస్ కు దాసోజు శ్రవణ్ గుడ్ బై
కులం..ధనమే పీసీసీలో నడుస్తోంది
Dasoju Sravan : కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ కోలుకోలేని షాక్ ఇచ్చారు. తాను పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, పార్టీకి సంబంధించిన అన్ని పదవుల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.
శుక్రవారం దాసోజు శ్రవణ్(Dasoju Sravan) మీడియాతో మాట్లాడారు. ఆయన ప్రధానంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ పార్టీని మాఫియా లాగా నడిపిస్తున్నాడంటూ ధ్వజమెత్తారు.
గత ఏడాది కాలం నుంచీ మధనపడుతూ వచ్చానని కానీ చివరకు గత్యంతరం లేని పరిస్థితుల్లో పార్టీని వీడాల్సి వచ్చిందన్నారు. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ,
భవిష్యత్తు పట్ల అచంచలమైన నమ్మకాన్ని కలిగి ఉన్న యువ నాయకుడు రాహుల్ గాంధీ పట్ల ప్రేమతో తాను ఇంత కాలం అవమానాలను భరిస్తూ వచ్చానని అన్నారు.
ప్రధానంగా ఏ విషయమైనా, లేదా ఏ అంశమైనా మంచి పట్టు కలిగిన నాయకుడిగా , మేధావిగా మన్నననలు అందుకున్నారు దాసోజు శ్రవణ్. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు.
కార్పొరేట్ కంపెనీలో లక్షల జీతాన్ని వదులుకుని ఉద్యమంలో పాలు పంచుకున్నారు. మొదట ప్రజారాజ్యంలో పని చేశారు. అక్కడ చిరంజీవి సమైక్యాంధ్రకు జై అనడంతో గుడ్ బై చెప్పారు.
అనంతరం కేసీఆర్ సారథ్యంలోని తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు. పార్టీ గొంతుకగా మారారు. కానీ తెలంగాణ ద్రోహులకు అందలం ఎక్కించడంతో తట్టుకోలేక కాంగ్రెస్ లోకి వచ్చారు.
గత కొంత కాలం నుంచీ పార్టీకి వెన్నెముకగా ఉన్నారు దాసోజు శ్రవణ్. శ్రవణ్ పార్టీని వీడడం విస్తు పోయేలా చేసింది.
Also Read : కాంగ్రెస్ గూటికి చెరుకు సుధాకర్