Deputy CM Pawan Kalyan: ఫార్మా ప్రమాద ఘటనలో యాజమాన్యం నిర్లక్ష్యం ఉన్నట్లు తెలుస్తోంది – డిప్యూటీ సీఎం పవన్‌

ఫార్మా ప్రమాద ఘటనలో యాజమాన్యం నిర్లక్ష్యం ఉన్నట్లు తెలుస్తోంది - డిప్యూటీ సీఎం పవన్‌

Deputy CM: అనకాపల్లి జిల్లా అచ్చుతాపురం ఫార్మా సెజ్ లో ఎసెన్స్ ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలిన ప్రమాదంలో 17 మంది మృతి చెందగా మరో 30 మందికి పైగా గాయాల పాలయ్యారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం విశాఖ కేజీహెచ్ కు తరలించగా… క్షతగాత్రుల అనకాపల్లి, విశాఖపట్నంలోని పలు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ ప్రమాద ఘటనపై స్పందించిన సీఎం చంద్రబాబు… గురువారం విశాఖ చేరుకుని కేజీహెచ్, మెడికవర్, అచ్చుతాపురం సెజ్, అనకాపల్లి ఆసుపత్రులను సందర్శించి క్షతగాత్రులను, మృతుల బంధువులను ఓదార్చారు. అనంతరం ప్రమాదానికి గల కారణాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ ప్రమాదంలో మృతి చెందిన వారికి కోటి రూపాయలు, తీవ్ర గాయాలయిన వారికి 50 లక్షలు, గాయాలయిన వారికి 25 లక్షలు నష్ట పరిహారాన్ని ప్రకటించారు.

Deputy CM Pawan Kalyan Comment

ఈ నేపథ్యంలో అచ్యుతాపురం ఫార్మా ప్రమాదం చాలా బాధాకరమని డిప్యూటీ సీఎం(Deputy CM) పవన్‌ కళ్యాణ్‌ అన్నారు. మంగళగిరిలోని నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రమాదంలో యాజమాన్యం నిర్లక్ష్యం ఉన్నట్లు తెలుస్తోందన్నారు. కాలుష్య నియంత్రణ తన శాఖ పరిధిలో ఉందని, భద్రత వేరే శాఖ కిందికి వస్తుందని చెప్పారు. పరిశ్రమల్లో సేఫ్టీ ఆడిట్‌ నిర్వహించాలని గతంలో చాలా సార్లు చెప్పామన్నారు. ప్రజల ప్రాణాలు, కార్మికుల భద్రత కోసం సేఫ్టీ ఆడిట్‌ చేయించాలని అభిప్రాయపడ్డారు. సెప్టెంబర్‌లో విశాఖ జిల్లాకు వెళ్లి భద్రతా చర్యలపై ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామన్నారు. ప్రతి వారం ఏదో ఒక ప్రమాదం జరగడం బాధాకరమని చెప్పారు. సంతాపం తెలిపి పరిహారం ఇవ్వడంతో సమస్య పరిష్కారం కాదన్నారు. రాబోయే 3 నెలల్లో పరిశ్రమల భద్రతపై కార్యాచరణ సిద్ధం చేస్తామన్నారు.

Also Read : Gaddar Awards: గద్దర్ అవార్డులపై కమిటీను నియమించిన తెలంగాణ ప్రభుత్వం !

Leave A Reply

Your Email Id will not be published!