కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం పోస్టుకు సంబంధించి ఇంకా అభ్యర్థి ఎవరనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. ఢిల్లీ వేదికగా మల్లగుల్లాలు పడుతోంది ఏఐసీసీ. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు మల్లికార్జున్ ఖర్గే ఎవరిని నియమిస్తారని ఉత్కంఠ నెలకొంది. ఓ వైపు భారీ మెజారిటీ వచ్చినా కనీసం సీఎం క్యాండిడేట్ ను ఎంపిక చేయలేని పరిస్థితిలో ఉంది పార్టీ హైకమాండ్ .
ఈ తరుణంలో డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఢిల్లీలో జాతీయ మీడియాతో మాట్లాడారు. తాను రాజీనామా చేస్తున్నట్లు కొందరు పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నారని ఇది మంచి పద్దతి కాదన్నారు. ఎవరు ఇలాంటి దుష్ప్రచారం చేసినా తాను పరువు నష్టం కేసు వేస్తానని హెచ్చరించారు డీకే శివకుమార్.
తాను బాధ్యత కలిగిన మనిషినని , వెన్ను పోటు పోడవనని స్పష్టం చేశారు. అంతే కాదు తనకు బ్లాక్ మెయిల్ రాజకీయాలు రావంటూ పేర్కొన్నారు. తాను బతికినంత దాకా కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని చెప్పారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. తనకు పార్టీ తల్లి లాంటిదని , సోనియా గాంధీ ఏం చెబితే తాను అది చేసేందుకు సిద్దంగా ఉన్నానని కుండ బద్దలు కొట్టారు డీకే శివకుమార్.
