Eemani : వీణ పై ప్రతి వాణిని పలికించిన వైణికుడు ఈమని

Eemani : శంకరాభరణం శంకరశాస్త్రి అంటే తెలియని వారు ఉండరేమో గాని, ఈమని శంకరశాస్త్రి గురించి ఈ నాడు చాలా మందికి తెలియక పోవచ్చు.

శంకరాభరణం శంకరశాస్త్రి అంటే తెలియని వారు ఉండరేమో గాని, ఈమని శంకరశాస్త్రి గురించి ఈ నాడు చాలా మందికి తెలియక పోవచ్చు. వీణలో మహామహోపాధ్యాయుడైన ఈమని శంకరశాస్త్రి (సెప్టెంబర్ 23, 1922 – డిసెంబర్ 23, 1987) సంగీత కచేరీలు విన్నవారికి ఆయన గొప్పదనం ఎటువంటిదో తెలిసినదే.  వాద్య సంగీతంలో శంకరశాస్త్రితో పోల్చదగిన వ్యక్తులు ఆనాడూ, ఈనాడూ కూడా చాలా తక్కువమందే కనిపిస్తారు. గమక విన్యాసంలోనూ, రాగ ప్రస్తారంలోనూ ఆయనది అద్వితీయమైన ప్రతిభ. వీణ మీద ఎన్ని రకాల శబ్దాలు పలికించ వచ్చునో పరిశోధించి, శోధించి నిరూపించిన అనన్య సామాన్య కళాకారుడాయన. కారణాలేవైనప్పటికీ ఇంత గొప్ప కళాకారుడికి రావలసిన ఖ్యాతి మాత్రం రాలేదు.సీతారామ కల్యాణం (రావణుడు వీణ వాయించే ఘట్టం), వెంకటేశ్వర మహత్యం (సరస్వతి “వాచస్పతి” రాగం వాయించే సీను) మొదలైన కొన్ని తెలుగు సినిమాల్లో శాస్త్రి వీణ నేపథ్యం వినబడుతుంది.

 

కచేరీలలో అప్పుడప్పుడూ పాట పాడి వినిపిస్తూ అవే సంగతులను వీణమీద పలికించే అలవా టుండేది. మంత్రపుష్పం వంటివి వాయిస్తున్నప్పుడు “ప్రజా”వంటి పదాలను ఉచ్చరిస్తూ కుడిచేత్తో అందుకు అనుగుణంగా డబుల్‌ మీటు వేసేవారు. ఇక కుడి చేత్తో ఆయన తీగలను మీటే పద్ధతి కూడా చాలా గొప్పగా ఉండేది. సందర్భాన్నీ, అవసరాన్నీ బట్టి ఆయన తన కుడి చేతి పొజిషన్‌నూ, తీగను మీటే స్థానాన్నీ పలు రకాలుగా మార్చేవారు. ఆయన పలికించిన తానం అనితర సాధ్యం. మూడో తీగనూ, నాలుగో తీగనూ బొటన వేలితో మీటుతూ మంద్ర, అనుమంద్ర స్థాయిల్లో స్వరాలను అత్యద్భుతంగా వాయించే వారు. మామూలుగా ఉండే మూడు తాళం తీగలే కాక మరొక రెండు ఏర్పాటు చేసి, వాటిని రాగంలోని స్వరాలకు శ్రుతిచేసి మొత్తం మీద ఒక ఆర్కెస్ర్టావంటి ప్రభావాన్ని కలిగించేవారు. కేవలం ఒక్క వీణతోనే అరుదైన రాగాలను ఎంతో డ్రమటిక్‌గా, పెద్ద సింఫొనీ స్థాయిలో వాయించేవారు. ఈ టెక్నిక్‌ల మాట ఎలా ఉన్నా సంగీత కారునిగా ఆయనది ఎంతో పరిక్వత చెందిన మేధస్సు. రాగ స్వభావాన్ని గంభీరంగా, హుందాగా, ఎటువంటి వెకిలి తనమూ లేకుండా వినిపించడం ఆయన ప్రత్యేకత.  ఏ మాత్రమూ వేగాన్నీ, ఆర్భాటాన్నీ ప్రదర్శించకుండా స్వరకల్పనలో ఎంతో ఉద్వేగాన్నీ, ఆర్తినీ సునాయాసంగా సృష్టించేవారు. తాను పూర్తిగా రాగభావంలో లీనమై, ప్రేక్షకుల ఉనికిని కూడా గమనించ కుండానే వారిని సంగీతపు అలలలో ఓలలాడించే వారు. ఆయన కచేరీకి ఎన్నిసార్లు వెళ్ళినా, అద్వితీయ మైన ఆయన ప్రతిభ అందరినీ ఆశ్చర్య చకితులను చేస్తూ ఉండేది.

రవిశంకర్‌, హలీమ్‌ జాఫర్‌ఖాన్‌ వంటి సితార్‌ విద్వాంసులతోనూ, గోపాల్‌కృష్ణ వంటి విచిత్రవీణ కళాకారుల తోనూ జుగల్‌బందీ కచేరీలు చెయ్యడం ఆయన చేశారు. సూర్‌దాస్‌ భజనలకూ, ఇతర గీతాలకూ ఆయన పహాడీ మొదలైన హిందూస్తానీ రాగాల్లో  స్వర రచన చేశారు. రేడియోలో అనేక గీతాలకు లలిత సంగీతం సమకూర్చారు. అందులో “న జానే క్యా లాచారీ హై” అనే హిందీ పాటను బాలమురళీకృష్ణ గుజరీతోడీ రాగంలో పాడారు. అలాగే దేవులపల్లివారి రచన “ఒదిగిన మనసున పొదిగిన భావము” అనే పాటకు శాస్త్రి మిశ్ర కాఫీ రాగంలో స్వర పరిచారు. చేశారు. ఢిల్లీలో రేడియో చీఫ్‌ ప్రొడ్యూసర్‌ గానూ, నేషనల్‌ ఆర్కెస్ర్టా కంపోజర్‌ కండక్టర్‌ గానూ ఆయన ఎన్నో అద్భుతమైన సంగీత రచనలు చేసి వాద్యబృందాన్ని నిర్వహించారు. వాటిలో శిఖరారోహణం, భ్రమర విన్యాసం, సౌమ్య పురుష మొదలైనవి పేరు పొందాయి.

ఆయన 1942-50 మధ్యలో మద్రాసులోని జెమినీ స్టూడియోలో సాలూరు రాజేశ్వరరావుకు సంగీత దర్శకత్వంలో సహాయకునిగా ఉన్నారు. ఆ కాలంలోనే చిట్టిబాబు ఆయనకు శిష్యుడయాడు. 1951లో పి.బి.శ్రీనివాస్‌ను సినీ గాయకుడుగా పరిచయం చేసినది ఈమనే.. 1940లో తిరుచ్చి రేడియో కేంద్రంలో మొదటగా వీణ కచేరీ చేశాక ఆయనకు పేరు లభించ సాగింది. ఆకాశవాణి డైరక్టరేట్ లో సంగీత విభాగంలో చీఫ్ ప్రొడ్యూశర్ గా పనిచేసి,  వైణికులుగా లబ్ధ ప్రతిష్ఠులైన శంకరశాస్త్రి ఢిల్లీలో సముచిత గౌరవాన్ని పొందారు.

న్యూయార్క్ లో,‌ వీణావిస్ట్రో బిరుదుతో అమెరికా ప్రభుత్వం 1973లో సత్కరించింది. రష్యా, ఆస్ట్రియా దేశాలు ప్రత్యేక అతిథిగా గౌరవించాయి. ఐక్యరాజ్య సమితి, యునెస్కో అవార్డులు వరించాయి. ప్యారిస్, రోమ్‌లో జరిగిన పలు కచేరిల్లో పాల్గొని సత్కారాలు పొందారు. కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం అందించింది. రాష్ట్ర ప్రభుత్వ రాష్ట్రసంగీత విద్యాంసునిగాను, టీటీడీ ఆస్థాన సంగీతకారునిగా పనిచేశారు. గుంటూరులో జరిగిన ఓ కార్యక్రమంలో స్వర్ణ కంకణ ధారులై,  తిరిగి చెన్నైకి రైల్లో వెళుతూ,  ఈమని 1987 డిసెంబర్‌ 23న రైలు ప్రయాణంలోనే  కన్ను మూశారు.

No comment allowed please