ESMA on Anganwadi Workers: అంగన్వాడీలపై ‘ఎస్మా’ చట్టం ప్రయోగించిన ప్రభుత్వం
అంగన్వాడీలపై 'ఎస్మా' చట్టం ప్రయోగించిన ప్రభుత్వం
ESMA on Anganwadi Workers: తమ డిమాండ్లను పరిస్కరించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడుతున్న అంగన్వాడీలపై ఏపి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. నిబంధలకు విరుద్ధంగా సమ్మె నిర్వహిస్తున్న అంగన్వాడీలపై ఎస్మా చట్టాన్ని ప్రయోగిస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. దీనికోసం అంగన్వాడీలను అత్యవసర సర్వీసుల క్రిందకి తీసుకొస్తూ జీవో నెంబరు 2న విడుదల చేసింది. ఈ జీవో నెంబరు రెండు ప్రకారం ఆరు నెలల పాటు అంగన్వాడీ(Anganwadi) వర్కర్స్, హెల్పర్లు సమ్మెలు, నిరసనలు చేయడంపై నిషేధం విధిస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. అంతేకాదు సమ్మె చేసిన కాలానికి అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల వేతనంలో రూ.3,450 తగ్గించి.. రూ.8,050 వేతనాన్ని వారి ఖాతాల్లో జమచేసింది. తమ న్యాయమైన డిమాండ్ల కోసం గత 26 రోజులుగా శాంతియుతంగా ఆందోళన చేపడుతున్న అంగన్వాడీలపై ఎస్మా చట్టం ప్రయోగించడంపై రాష్ట్రంలోని వివిధ రాజకీయ పార్టీలు, కమ్యూనిస్టు పార్టీలు, కార్మిక సంఘాలు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగం… అధికార పార్టీ నియంత పోకడలకు పరాకాష్ట అంటూ ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్నాయి.
అంగన్వాడీలపై ‘ఎస్మా’ ప్రయోగం జగన్ నియంత పోకడలకు పరాకాష్ఠ- లోకేశ్
అంగన్వాడీలపై(Anganwadi) ప్రభుత్వం ఎస్మా చట్టం ప్రయోగించడంపై టీడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్(Nara Lokesh)ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. న్యాయమైన డిమాండ్ల కోసం ప్రజాస్వామ్యం బద్దంగా శాంతియుత వాతావరణంలో ఆందోళన చేపడుతున్న అంగన్వాడీలపై ఎస్మా చట్టం ప్రయోగించడం జగన్ నియంత పోకడలకు పరాకాష్ఠ అంటూ ద్వజమెత్తారు. అమ్మనే గెంటేసిన వ్యక్తికి అంగన్వాడీల విలువ ఏం తెలుసంటూ ఎద్దేవా చేసారు. ఇచ్చిన హామీలను అమలు చేయాలని నిరసన చేయడం కూడా నేరమేనా ? అని ప్రశ్నించారు. ప్రభుత్వ చర్యలను నియంత పోకడలకు పరాకాష్ఠగా అభివర్ణిస్తూ జీవో నెం.2ను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అంతేకాదు జగన్ అహంకారానికి, అంగన్వాడీల ఆత్మగౌరవానికి మధ్య జరుగుతున్న ఈ యుద్ధంలో అంతిమంగా ఉద్యోగులే విజయం సాధిస్తారని అన్నారు.
ESMA on Anganwadi Workers – అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగం సరైందే: సజ్జల
అయితే అంగన్వాడీల సమ్మెపై ఎస్మా ప్రయోగం సరైందేనని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… ‘‘అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలు, గర్భిణులు ఇబ్బంది పడుతున్నారు. వారి ప్రాణాలు కాపాడే బాధ్యత ప్రభుత్వంపై ఉంది. అత్యవసర సర్వీసుల కింద ఉన్నారు.. తిరిగి విధుల్లో చేరాలని పలుమార్లు విజ్ఞప్తి చేశాం. కానీ, ప్రభుత్వ ఆదేశాలను వారు ధిక్కరించారు. అందుకే అంగన్వాడీల సమ్మెపై ఎస్మా ప్రయోగించాల్సి వచ్చింది’’ అని పేర్కొన్నారు.
అసలు ‘ఎస్మా’ అంటే ఏంటి ?
‘ఎస్మా’ పూర్తి నిర్వచనం ‘ఎసెన్సియల్ సర్వీసెస్ మెయిన్‌టీనెన్స్ యాక్ట్’. సమ్మెలు, హర్తాళ్లు వంటి సందర్భాల్లో ప్రజల దైనందిన జీవనానికి ఇబ్బంది కలగకుండా… కొన్ని రకాల అత్యవసర సేవల నిర్వహణ అవిచ్ఛిన్నంగా కొనసాగేలా చూసేందుకు 1981లో రూపొందించిన చట్టం ఈ ఎస్మా. అత్యవసర సేవలు అందించే ఉద్యోగులు తమ విధులకు హాజరు కాకుండా ఆయా సేవలకు విఘాతం కలిగేలా సమ్మెలోకి దిగితే… జనజీవనానికి ఇబ్బంది కలగకుండా చూసేందుకు ప్రభుత్వానికి ఈ చట్టాన్ని ప్రయోగించే అధికారం ఉంటుంది. ఈ ఎస్మా చట్టం ప్రకారం నిబంధనలను అతిక్రమించి ఎవరైనా సమ్మెకు దిగినట్లైతే… నేర శిక్షా స్మృతి (సీపీసీ)తో సంబంధం లేకుండానే… పోలీసు అధికారులు వారెంట్ అవసరం లేకుండానే అరెస్టు చేయొచ్చు. ఎస్మా నిబంధనలకు విరుద్ధంగా సమ్మె చేసే ఉద్యోగులను డిస్మిస్ చేయడంతో సహా వివిధ రకాల క్రమశిక్షణా చర్యలూ చేపట్టవచ్చు. అంతేకాదు సమ్మెలో పాల్గొంటున్నవారికి, వారిని ప్రోత్సహిస్తున్న వారికి కూడా జైలు శిక్ష, జరిమానా, లేదా రెండూ విధించవచ్చు. ఈ ఎస్మా చట్టం ప్రకారం సమ్మెకు ఆర్థిక సహకారం అందించేవారూ శిక్షార్హులే !
Also Read : Telangana : తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలకు సన్నాహాలు చేస్తున్న ఈసీ