Ex MP Vijayasai Reddy: ఒక రోజు ముందుగానే సిట్ ముందుకు మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి
ఒక రోజు ముందుగానే సిట్ ముందుకు మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి
Vijayasai Reddy : గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం కేసులో ఈ నెల 18న విచారణకు హాజరుకావాలని మాజీ ఎంపీ విజయసాయి రెడ్డికి సిట్ అధికారులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారిన ఈ కేసులో… విజయసాయి రెడ్డి(Vijayasai Reddy) ఒక్క రోజు ముందుగా అంటే 17వ తేదీన సిట్ అధికారుల ముందు విచారణకు హాజరుకానున్నారు. తనకు ముందుగా నిర్ణయించిన ముఖ్యమైన కార్యక్రమాలు ఉండటంతో ఒక్కరోజు ముందు అంటే 17వ తేదీన విచారణకు వస్తున్నానని మాజీ ఎంపీ సిట్ అధికారులకు సమాచారం పంపించారు. దీనితో 17వ తేదీన విచారణకు రావాలని… తాము రెడీ అంటూ విజయసాయికి సిట్ అధికారులు సమాచారం పంపారు. ఈ నేపథ్యంలో గురువారం విజయవాడలోని సిట్ కార్యాలయంలో మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి విచారణకు హాజరుకానున్నారు.
Vijayasai Reddy Attend..
మరోవైపు మద్యం కుంభకోణం(AP Liquor Scam) కేసులో ఏపీ సిట్ అధికారులు వేగం పెంచారు. ఈ కేసులో ఈ నెల 18న విచారణకు రావాల్సిందిగా మంగళవారం విజయసాయికి సిట్(SIT) నోటీసులు ఇచ్చింది. దీనిపై స్పందించిన మాజీ ఎంపీ ముందగానే నిర్ణయించిన కార్యక్రమాలు ఉండటంతో 17నే వస్తానని సిట్ అధికారులకు సమాచారం పంపగా… అందుకు తాము రెడీ అంటూ సిట్ స్పష్టం చేసింది. గతంలో కాకినాడ సీపోర్టు, కాకినాడ సెజ్ వ్యవహారంలో ఏపీ సీఐడీ నమోదు చేసిన కేసులో విజయసాయిరెడ్డిని విజయవాడ సీఐడీ కార్యాలయానికి పిలిపించారు. ఈ సమయంలో మద్యం కుంభకోణానికి సంబంధించి మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా… మద్యం కుంభకోణంలో కర్త, కర్మ, క్రియ రాజ్ కసిరెడ్డే అని, ఈ విషయాన్ని దర్యాప్తు అధికారులకు కూడా చెబుతానని తెలిపారు. ఈ నేపథ్యంలోనే విజయసాయి వద్ద ఉన్న సమాచారాన్నిసేకరించేందుకు మాజీ ఎంపీకి ఏపీ సిట్ బృందం నోటీసులు పంపించింది.
మద్యం కుంభకోణం కేసులో కసిరెడ్డికి మరోసారి నోటీసులు
మరోవైపు ఈ కేసుకు సంబంధించి కసిరెడ్డి రాజశేఖర రెడ్డికి ఏపీ సిట్ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేసారు. విజయవాడ సీపీ కార్యాలయంలోని సిట్ కార్యాలయానికి ఈనెల 19వ తేదీన విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. కాగా… ఈ కేసుకు సంబంధించి ఇప్పుటికే మూడు సార్లు రాజ్ కసిరెడ్డికి సిట్ అధికారులు నోటీసులు ఇచ్చినప్పటికీ ఆయన డుమ్మా కొట్టారు. ఆయన ఫోన్లన్నీ స్విచ్‌ఆఫ్ రావడంతో గత రెండు రోజుల నుంచి సిట్ దర్యాప్తు బృందాలు హైదరాబాద్ లో ఆయనకు సంబంధించిన బంధువులు, స్నేహితులు, ఇతర శ్రేయోభిలాషుల కార్యాలయాల్లో దాడులు నిర్వహించారు. కసిరెడ్డి ఇంటికి నోటీసులు అంటించారు.
గత రాత్రి నోటీసులు అంటించడంతో పాటు… ఈరోజు తాజాగా మరోసారి నోటీసులు ఇచ్చారు. ఈనెల 19న విచారణకు రావాల్సిందిగా అందులో పేర్కొన్నారు. అంతేకాకుండా కసిరెడ్డి పెట్టుబడులు పెట్టినట్లు గుర్తించిన సిట్… ఆయా సంస్థల డైరెక్టర్లకు నోటీసులు ఇచ్చి విచారణకు రావాల్సిందిగా ఆదేశాలు ఇవ్వాలని సిట్ అధికారులు నిర్ణయించారు. నేడో, రేపో వీరికి సిట్ నోటీసులు వెళ్లనున్నాయి. అదే విధంగా రాజ్ కసిరెడ్డి తండ్రికి కూడా నోటీసులు ఇచ్చి… ఆయనను కూడా విచారణకు పిలిపించాలని నిర్ణయించారు.
Also Read : Guntur Police: పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ పై అసభ్యకర పోస్టులు పెట్టిన వ్యక్తి అరెస్ట్