తిరుపతి/ ఒంటిమిట్ట : ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి వారి శ్రీరామ నవమి బ్రహ్మోత్సవాల ఏర్పాట్ల పనులను వేగవంతంగా పూర్తి చేయాలని టీటీడీ జేఈవో వి. వీరబ్రహ్మం అధికారులను ఆదేశించారు. ఆయన ఒంటిమిట్టలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా జేఈవో మాట్లాడుతూ ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి వారి దర్శనానికి విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మార్చి 16 నుండి నిత్య అన్న ప్రసాదం వితరణ ప్రారంభించనున్నట్లు తెలిపారు. టీటీడీలోని అన్ని విభాగాలు జిల్లా యంత్రాంగంతో సమన్వయం చేసుకొని పనులను త్వరితగతిన పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
అలాగే ఆలయ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన నిత్య అన్న ప్రసాద భవనాన్ని ప్రారంభించ నున్నట్లు తెలిపారు. అనంతరం జేఈవో వి. వీరబ్రహ్మం అధికారులతో కలిసి ఆలయ నాలుగు మాడ వీధులు, నిత్య అన్నప్రసాద భవనం, శ్రీ సీతారాముల కల్యాణ వేదికలను పరిశీలించి పలు సూచనలు చేశారు. తదుపరి టీటీడీ, జిల్లా అధికారులతో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ సీఈ టి.వి.సత్యనారాయణ, ఎస్ఈ (ఎలక్ట్రికల్) వెంకటేశ్వర్లు, గార్డెన్ సూపరింటెండెంట్ శ్రీనివాసులు, డిప్యూటీ ఈవోలు శివప్రసాద్, సెల్వం, డీఈ (ఎలక్ట్రికల్) రవి శంకర్ రెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు.
ఇదిలా ఉండగా శ్రీ కోదండ రామస్వామి బ్రహ్మోత్సవాలను పరిశీలించిన అనంతరం జేఈవో మీడియాతో మాట్లాడారు. భారీ ఎత్తున ఈ ఉత్సవాలకు భక్తులు హాజరవుతారని , ఇందు కోసం భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఏఒక్క భక్తుడికి ఇబ్బంది లేకుండా చూస్తామన్నారు.
