Nirmala Sitharaman : విపరీత విధానాలు ప్రమాదకరం
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
Nirmala Sitharaman : కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె ప్రత్యేకించి అభివృద్ధి చెందిన దేశాలను విమర్శించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదిలా ఉండగా అంతర్జాతీయ ద్రవ్య నిధి, ప్రపంచ బ్యాంకు వార్షిక సమావేశాలకు హాజరయ్యేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి అమెరికాలో ఉన్నారు.
వాషింగ్టన్ లోని బ్రూకింగ్స్ ఇనిస్టిట్యూషన్ లో పాల్గొని ప్రసంగించారు. అభివృద్ది చెందిన దేశాలు తమ రాజకీయ , ఆర్థిక విధాన నిర్ణయాలకు సంబంధించి ప్రపంచ వ్యాప్తంగా బాధ్యత వహించాలని ఆర్థిక శాఖ మంత్రి స్పష్టం చేశారు. విపరీతమైన విధానాలు, మార్కెట్ ప్రతిస్పందనలకు ఎలా దారితీశాయో హైలెట్ చేశారు.
ఈ విధానాలతో ఎటువంటి సంబంధం లేని దేశాలు దాని పరిణామాలను ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు. దేశాలపై ఆంక్షలు విధించడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదన్నారు నిర్మలా సీతారామన్. గ్లోబల్ ఎకానమీలో ఇప్పుడు విపరీతమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయని, వీటిని గుర్తించి ముందుకు సాగడమే ముందున్న ప్రధానమైన సవాల్ అని పేర్కొన్నారు కేంద్ర ఆర్థిక మంత్రి(Nirmala Sitharaman).
భారత ఆర్థిక వ్యవస్థతో సహా ఏ ఆర్థిక వ్యవస్థకు ప్రపంచ ప్రవాహాల ప్రభావం నుండి మినహాయింపు లేదన్నారు. కరోనా మహమ్మారి షాక్ తర్వాత ఐరోపాలో శక్తి, ఎరువులు, ఆహార ఉత్పత్తులపై పెను ప్రభావం పడిందన్నారు నిర్మలా సీతారామన్.
సహజంగానే భారత దేశంతో సహా అనేక దేశాలలో వృద్ది అంచనాలు తక్కువగా సవరించబడ్డాయని పేర్కొన్నారు కేంద్ర మంత్రి. వృద్ధి అంచనాలు తగ్గుతున్నాయని తనకు తెలుసన్నారు. భారత దేశం 7 శాతం వృద్ధిని సాధిస్తుందన్న నమ్మకం తనకు ఉందన్నారు నిర్మలా సీతారామన్.
Also Read : పెరుగుతున్న కరోనా కేసులతో పరేషాన్