పొగ‌డ్త‌లు కాదు ప‌నిపై శ్ర‌ద్ద వ‌హించండి : ప‌వ‌న్ క‌ళ్యాణ్

దిశా నిర్దేశం చేసిన ఏపీ ఉప ముఖ్య‌మంత్రి

అమ‌రావ‌తి : ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. గత ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్దుకుంటూ, వ్యవస్థలను బలోపేతం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం అన్నారు. ఐదేళ్ల పాలనలో ఎన్నో తప్పులు చేశారు. సోషల్ ఆడిట్ విషయంలో కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. గత ప్రభుత్వ హయాంలో తప్పులు చేసిన వారిపై చర్యలు కూడా ఇంత వ‌ర‌కు తీసుకోలేద‌న్నారు. నాకు చప్పట్లు, పొగడ్తలు అవసరం లేదు. పని మాత్రమే కావాలి. ఉన్నత స్థాయి అధికారి నుంచి ఫీల్డ్ అసిస్టెంట్ వరకు ప్రతి ఒక్కరు నిబద్ధతతో పని చేయాలి. ఉపాధి హామీ, జల్ జీవన్ మిషన్ పనుల్లో నిర్లక్ష్యాన్ని, నిధుల దుర్వినియోగాన్ని సహించం అని వార్నింగ్ ఇచ్చారు. నిర్దేశిత లక్ష్యాలను చేరుకోవడంలో విఫలం అయినా, పని పట్ల నిర్లక్ష్యం వహించినా కఠినంగా వ్యవహరిస్తాం అన్నారు. సోషల్ ఆడిట్ కూడా మొక్కుబడిగా కాకుండా పక్కాగా జరగాలి. క్షేత్ర స్థాయిలో ఉన్న ప్రతి వ్యక్తికి అభివృద్ధి ఫలాలు అందాలి అని స్ప‌ష్టం చేశారు. విశాఖ‌లో పంచాయ‌తీరాజ్, ఆర్ డ‌బ్ల్యూఎస్ శాఖ‌ల‌పై ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌మీక్ష చేప‌ట్టారు.

నా వైపు నుంచి ఎలాంటి రాజకీయ ఒత్తిడులు, సిఫార్సులు ఉండవు. ప్రతి అధికారి నిబంధనలకు లోబడి మాత్రమే పని చేయాలని అన్నారు. గత ప్రభుత్వంలో పని చేసిన కొంత మంది అధికారులు ఇప్పటికీ ఆ నాయకులతో సంబంధాలు కొనసాగిస్తూ.. ప్రభుత్వ పాలసీల అమలులో నిర్లక్ష్యం వహిస్తున్న విషయం మా దృష్టికి వచ్చింద‌న్నారు. పనిలో అలసత్వాన్ని అస్సలు సహించం అన్నారు. ఎలాంటి రాజకీయ ప్రలోభాలకు తావులేకుండా ప్రతి ఒక్కరు నిబంధనల మేరకు మాత్రమే పని చేయాలని స్ప‌ష్టం చేశారు ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొణిద‌ల‌. పంచాయతీరాజ్ శాఖను బలోపేతం చేసేందుకు ఎన్నో సంస్కరణలు అమలు చేస్తున్నాం. ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న ప్రమోషన్లు ఎలాంటి ప్రలోభాలకు తావులేకుండా పూర్తి చేశాం. ఒకేసారి 10 వేల మందికి పదోన్నతులు కల్పించి మా చిత్తశుద్ధిని చాటుకున్నాం. ఏ కష్టం వచ్చినా అండగా ఉంటున్నాం. ఉమ్మడి కడప జిల్లాలో ఓ ఎంపీడీవోపై దాడి జరిగితే వెంటనే స్వయంగా వెళ్లి భరోసా ఇచ్చాం. మీ ప్రమోషన్ల సంతోషం.. ప్రజల్లోనూ కనబడాలని అన్నారు.

Leave A Reply

Your Email Id will not be published!