హైదరాబాద్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని ఏకి పారేశారు. తన తండ్రి, తెలంగాణకు తొలి ముఖ్యమంత్రిగా పని చేసిన కేసీఆర్ గురించి మాట్లాడే నైతిక నీకు లేదన్నారు. నీలాగా చిల్లరగా చిలకొట్టుడు కొట్టి బ్లాక్ మెయిల్ చేసిన నాయకుడు తను కాదన్నారు. ఉద్యమాల ఉగ్గుపాలతో ఢిల్లీ మెడలు వంచి రాష్ట్రాన్ని తెచ్చిన నాయకుడు కేసీఆర్ అని గుర్తు పెట్టుకుంటే మంచిదని హితవు పలికారు. ఆయన కాలి గోటికి కూడా నువ్వు సరిపోవంటూ మండిపడ్డారు. కాలం మనది కానప్పుడు తీన్ ఫుట్ గాడు కూడా తీస్మార్ ఖాన్ లాగా మాట్లాడుతాడంటూ ఎద్దేవా చేశారు. ఆయన అధికారంలో ఉన్నాడు మైక్ కట్ కాబట్టి ఏదైనా వాగుతాడని అన్నారు.
ఇది బడ్జెట్ సెషన్ కాదు.. కాంగ్రెస్ పార్టీ హిస్టరీ సెషన్ అంటూ సీరియస్ కామెంట్స్ చేశారు కేటీఆర్. రేవంత్ రెడ్డి వచ్చుడు వచ్చుడే మోతీలాల్, గోతీలాల్ నెహ్రూని , సోనియా గాంధీని బలిదేవత అని కామెంట్స్ చేసిన విషయం మరిచి పోయారని అనుకుంటే పొరపాటు పడినట్లేనని అన్నారు. గత రెండు రోజులుగా శాసనసభలో ప్రతిపక్షం ఆరు గ్యారంటీల గురించి, పేదల ఇండ్లను విధ్వంసం చేస్తున్న ప్రభుత్వ నిర్ణయాల గురించి నిలదీస్తున్నదని చెప్పారు. రెండు రోజులుగా హస్తినలో అధిష్టానం ముందు అపాయింట్మెంట్ గురించి పడిగాపులు పడ్డ తెలంగాణ ముఖ్యమంత్రి వచ్చి సమాధానం ఇవ్వాల్సింది ఉందన్నారు.
అధికారం కోసం ఇచ్చిన హామీల గురించి, ప్రతిపక్షాలు శాసనసభలో నిలదీసిన ప్రశ్నల గురించి కానీ ప్రస్తావించక పోవడం దారుణమన్నారు. రెండేళ్లలో ఈ సర్కారు దోపిడీ ఎంత అన్నది ప్రతిపక్షం ప్రశ్నిస్తోందన్నారు. ఈ సర్కారు రైతు భరోసా ఎందుకు ఇవ్వడం లేదు, రైతుల పంటలు ఎందుకు కొనడం లేదని ప్రశ్నించారు.
