Gaurav Vallabh PM Modi : మోదీ వైఫల్యం భారత్ కు శాపం
కాంగ్రెస్ నేత గౌరవ్ వల్లభ్
Gaurav Vallabh PM Modi : భారత దేశ ఆర్థిక వ్యవస్థ రోజు రోజుకు భయంకరంగా మారిందని కాంగ్రెస్ ఆవేదన వ్యక్తం చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ పాలనలో దేశం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొందని మండిపడ్డారు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి గౌరవ్ వల్లభ్(Gaurav Vallabh).
ఈ ఏడాది ఆర్థిక రంగంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. తమ నాయకుడు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తోందని అన్నారు. ఇకనైనా ప్రధాని మోదీ మారాలని వీలైతే యాత్రలో పాల్గొనాలని కోరారు గౌరవ్ వల్లభ్.
భారత్ జోడో యాత్రను కావాలని బద్నాం చేయాలని చూస్తున్నారని, దానిపై ఫోకస్ పెట్టడం మానుకుని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని సూచించారు. ప్రాంతం, కులం, మతం పేరుతో మనుషుల మధ్య విభేదాలను సృష్టించడం మానుకోవాలన్నారు.
ఇకనైనా వ్యక్తిగత ప్రచారం కాకుండా పాలనపై ఫోకస్ పెట్టాలన్నారు గౌరవ్ వల్లభ్. ఓ వైపు ద్రవ్యోల్బణం, నిరుద్యోగ సమస్య పెరిగి పోతుంటే అంతా బాగుందంటూ ప్రధానమంత్రి గొప్పలు చెప్పడం దారుణమన్నారు.
నరేంద్ర మోదీ అబద్దాలు చెప్పడంలో ఆరి తేరారని, ప్రచారంలో నెంబర్ వన్ గా తనను తాను ప్రూవ్ చేసుకున్నారని కానీ పాలనలో మాత్రం సున్నానేనని ఎద్దేవా చేశారు గౌరవ్ వల్లభ్. 2022లో ప్రభుత్వం ఆర్థిక రంగంలో పూర్తిగా విఫలమైందని ధ్వజమెత్తారు. ప్రభుత్వ సంస్థలను అమ్మకానికి పెట్టిన మోదీ ప్రధానిగా ఉండేందుకు అర్హుడు కాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read : యాత్రకు ఎల్జీ సిన్హా లైన్ క్లియర్