#CNarayanaReddy : సాహితీ సమున్నత శిఖరం సినారేకలం
తెలంగాణ ఆస్తి సినారే
C NarayanaReddy : భారతీయ సాహితీ జగత్తులో మరిచిపోని వసంత మేఘం సినారే. అపూర్వమైన విజ్ఞానం కలిగిన వ్యక్తిగా..తెలుగు సాహిత్యానికి ఎనలేని కీర్తి ప్రతిష్టలను తీసుకు వచ్చిన సాహితీవేత్తగా పేరు గడించారు. ఆయన స్పృశించని ప్రక్రియ లేదంటే అతిశయోక్తి కాదేమో. కొన్ని దశాబ్దాలపాటు శాసించారు. తను లేకుండా ఏ కార్యక్రమం జరగని స్థాయికి చేరుకున్నారు. తెలంగాణలో ఎందరో గొప్ప వ్యక్తులు జన్మించారు. తనువు చాలించారు.
వారిలో సినారే, దాశరథి, కాళోజీ, వేదం జీవన నాదం ..దాశరథి కృష్ణమాచార్య , సామల సదాశివ లాంటి వారెందరో లెక్కించలేనంత మంది తమ శక్తిని ధారపోశారు. సాహిత్యానికి జీవం పోశారు. కొన్ని తరాలకు సరిపడా సాహిత్యపు విలువలను కాపాడుతూ అవి చెరిగి పోకుండా తమ కలాలకు పదును పెట్టారు. డాక్టర్ సింగిరెడ్డి నారాయణరెడ్డి (C NarayanaReddy ) గురించి చెప్పాలంటే ..నాలుగు దశాబ్ధాలను తిరగ తోడాల్సి ఉంటుంది.
కవిగా, రచయితగా, వక్తగా, సినీ గేయ రచయితగా, అనువాదకుడిగా, ఆచార్యుడిగా, వీసీగా, ప్రభుత్వ సలహాదారుగా , బహు భాషా కోవిదుడిగా, రాజ్యసభ సభ్యుడిగా ..ఇలా ప్రతి రంగంలో సినారే తనదైన ముద్ర కనబరిచారు. ఆయనకు లెక్కలేనంత మంది శిష్యులున్నారు. అనుంగు అనుచరులున్నారు. లెక్కించలేనంత మంది అభిమానులున్నారు. సినీ ప్రేమికులున్నారు.
తెలంగాణ మాండలికాన్ని అలవోకగా ఒలికించే సామర్థ్యం కలిగిన వారిలో సినారే కూడా ఒకరు. 1931లో జన్మించిన ఈ మహాకవి..2017లో ఈ మట్టిలో కలిసి పోయారు. ఉర్దూ, పారసీ భాషల్లో ఆయనకున్నంత పట్టు ఇంకెవ్వరికీ లేదు. ప్రారంభంలో సికింద్రాబాద్‌లోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో అధ్యాపకుడిగా చేరారు. ఆ తర్వాత నిజాం కాలేజీలో పనిచేశారు.
ఉస్మానియా యూనివర్శిటీలో పనిచేస్తూ అనేక ఉన్నత పదవులు అధిరోహించారు. పురస్కారాలు అందుకున్నారు. విశ్వనాథ సత్యనారాయణ తర్వాత జ్ఞానపీఠం పురస్కారం పొందిన తెలుగు సాహితీ కారుడు సినారేనే. విశ్వంభర కావ్యానికి ఆయనకు ఈ అవార్డు లభించింది.
కవిగా సుపరిచితులైనా ..సినారే కలం నుంచి పద్యాలు, గేయ కావ్యాలు, వచన కవితలు, గద్య కృతులు, చలనచిత్ర గీతాలు, యాత్రా కథనాలు, సంగీత నృత్య రూపకాలు, ముక్తక కావ్యాలు, బుర్ర కథలు, గజళ్లు, వ్యాసాలు, విమర్శన గ్రంథాలు, అనువాదాలు, ఇలా అనేకానికి ప్రాణం పోశారు. కాలేజీ విద్యార్థిగా ఉన్న సమయంలో శోభ పత్రికకు ఎడిటర్‌గా ఉన్నారు.
రోచిస్, సింహేంద్ర పేరుతో పోయెమ్స్ రాశాడు. సినారే తొలి కవిత జనశక్తి పత్రికలో అచ్చయింది. ఆ సమయంలోనే ప్రహ్లాద చరిత్ర, సీతాపహరణం వంటి పద్య నాటికలు, భలే శిష్యులు, తదితర సాంఘిక నాటకాలు రాశాడు. 1953లో నవ్వని పువ్వు సంగీత నృత్య నాటిక ప్రచురితమైంది. అదే ఆయన తొలి ప్రచురణ. జలపాతం, విశ్వగీతి , అజంతా సుందరి వెలువడ్డాయి. రామప్ప సంగీత నృత్య రూపకం అన్ని భాషల్లోకి అనువాదమైంది.
ఆయన పరిశోధన పుస్తకం ఆధునికాంధ్ర కవిత్వం – సంప్రదాయాలు, ప్రయోగాలు అత్యంత ప్రామాణిక గ్రంథంగా పేరొందింది. సినారే రాసిన పుస్తకాలు ఇంగ్లీష్, ఫ్రెంచ్, సంస్కృతం, హిందీ, మళయాళం, ఉర్దూ , కన్నడ తదితర భాషల్లోకి అనువాదమయ్యాయి. ఆయనే స్వయంగా హిందీ, ఉర్దూ భాషల్లో కవితలు రాశారు.
అమెరికా, ఇంగ్లండ్, ఫ్రాన్స్, రష్యా, జపాన్, కెనడా, ఇటలీ, డెన్మార్క్, థాయ్ లాండ్, సింగపూర్, మలేషియా, మారిషస్, యుగోస్లేవియా, ఆస్ట్రేలియా, గల్ఫ్ దేశాలలో పర్యటించారు. 1990లో స్రూగాలో జరిగిన ఇంటర్నేషనల్ కవి సమ్మేళనంలో భారతీయ భాషల ప్రతినిధిగా హాజరయ్యారు. రచనా రంగంలోనే వుంటూనే స్రవంతి సాహిత్య మాస పత్రికను నిర్వహించారు.
విశ్వంభర, మనిషి చిలక, ముఖాముఖి, భూగోళమంత మనిషి, దృక్ఫథం, కలం సాక్షిగా, కలిసి నడిచే కలం, కర్పూర వసంతరాయలు, మట్టి మనిషి ఆకాశం, మంటలు మానవుడు, తేజస్సు నా తపస్సు, నాగార్జున సాగరం, విశ్వనాథ నాయుడు, కొనగోటి మీద జీవితం, రెక్కల సంతకాలు, వ్యక్తిత్వం ఉన్నాయి.
1962లో తెలుగు చిత్రసీమలోకి గేయ రచయితగా ప్రవేశించారు. గులేబకావళి కథ సినిమాకు నన్ను దోచుకుందువటే వెన్నెల దొరసాని అనే పాట. ఇది మరింత పాపులర్ పాటగా నిలిచింది. అద్భుతమైన పాటలకు జీవం పోశారు నారాయణరెడ్డి. ఆత్మబంధువు , కులగోత్రాలు, రక్తసంబంధం, బందిపోటు, చదువుకున్న అమ్మాయిలు, కర్ణ, లక్షాధికారి, పునర్జన్మ, తిరుపతమ్మ కథ, అమరశిల్పి జక్కన్న, గుడిగంటలు, మంచి మనిషి, మురళీకృష్ణ, రాముడు భీముడు, మంగమ్మ శపథం, పరమానందయ్య శిష్యుల కథ, బందిపోటు దొంగలు, బంగారు గాజులు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సినిమాలు ఆయన రాసిన పాటలతో నడిచాయి.
పూవై విరిసిన పున్నమి వేళ సాంగ్ హిట్. ఈ నల్లని రాళ్లలో ఏ కన్నులు దాగెనో, అంతగా నను చూడకు మాటాడకు, తెలిసిందిలే నెల రాజ నీరూపు తెలిసిందిలే, విన్నానులే ప్రియా కనుగొన్నానులే ప్రియా, కనుల ముందు నీవుంటే కవిత పొంగి పారదా, గున్న మామిడి కొమ్మ మీద, అణువూ అణువున వెలసిన దేవా, అనుబంధం ఆత్మీయత అంతా బూటకం హిట్‌గా నిలిచాయి.
ఇక శారద మూవీలో ఆయన రాసిన శారద నను చేరగా..ఏమిటమ్మా సిగ్గా..అల్లూరి సీతారామరాజులో వస్తాడు నా రాజు ఈ రోజు అతి పెద్ద హిట్ పాటగా నిలిచింది. కృష్ణ వేణి తెలుగింటి విరిబోణి, స్నేహమేరా నా జీవితం, శివరంజనీ నవరాగిణి, అభినవ తారవో నా అభిమాన తారవో, జోరుమీదున్నావు తుమ్మెదా, సువ్వీ సువ్వీ సువ్వాలమ్మ , కరుణించే ప్రతి దేవత అమ్మే కదా లాంటి పాటలు అనేకం రాశారు.
ఎన్నో పురస్కారాలు, అవార్డులు అందుకున్నారు. 1988లో ప్రతిష్టాత్మకమైన జ్ఞానపీఠ అవార్డు, ఏపీ సాహిత్య అకాడెమీ పురస్కారం, కేంద్ర సాహిత్య అకాడెమీ, భారతీయ భాషా పరిషత్, రాజాలక్ష్మి పురస్కారం, సోవియట్ నెహ్రూ అవార్డు, అసాన్, పద్మశ్రీ, పద్మవిభూషణ్ అవార్డులు పొందారు.
ఓయు నుండి డాక్టరేట్ డిగ్రీ, ఉత్తమ పాటల రచయితగా నందులు, ఇతర అవార్డులు అందుకున్నారు. తెలుగు విశ్వ విద్యాలయం విశిష్ట పురస్కారాన్ని అందజేసింది. డాక్టర్ బోయి భీమన్న జీవన సాఫల్య పురస్కారం పొందారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన సినారే అడుగు జాడలు ఇంకా వెంటాడుతూనే ఉంటాయి.(C NarayanaReddy )
No comment allowed please