Parivartan Sankalp Yatra : గుజరాత్ పరివర్తన్ సంకల్ప యాత్ర
నవంబర్ 1 నుంచి కాంగ్రెస్ శ్రీకారం
Parivartan Sankalp Yatra : కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గుజరాత్ పరివర్తన్ సంకల్ప్ యాత్ర కొనసాగనుంది. ఇప్పటికే అగ్ర నేత రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో తమిళనాడు నుంచి ప్రారంభించిన భారత్ జోడో యాత్ర కొనసాగుతోంది. ఇప్పటి వరకు వేయి కిలోమీటర్లు దాటింది. తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలలో జోడో యాత్ర ముగిసింది.
ప్రస్తుతం తెలంగాణలో కొనసాగుతోంది. రాహుల్ యాత్రకు ఎనలేని స్పందన లభిస్తోంది. ఈ తరుణంలో పార్టీ మరో పాదయాత్రకు ప్లాన్ చేసింది. అక్టోబర్ 31 నుంచి ప్రారంభించాల్సి ఉండగా ఆదివారం రాత్రి 6.45 గంటలకు మోర్బీ బ్రిడ్జి కూలి 141 మందికి పైగా మృతి చెందడంతో గుజరాత్ పరివర్తన్ సంకల్ప్ యాత్రను(Parivartan Sankalp Yatra) వాయిదా వేసినట్లు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.
ఇందులో భాగంగా యాత్రను రేపటికి నవంబర్ 1కి వాయిదా వేసినట్లు వెల్లడించింది. ఇదిలా ఉండగా గుజరాత్ రాష్ట్రంలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ తరుణంలో పార్టీ మరింత బలోపేతం అయ్యేందుకు యాత్ర చేపట్టాలని నిర్ణయించింది. రాష్ట్రంలో బలమైన అధికార పార్టీని ఢీకొనేందుకు అన్ని అస్త్రాలను సిద్దం చేస్తోంది.
పార్టీ క్యాడర్ లో ఫుల్ జోష్ నింపే కార్యక్రమంలో నిమగ్నమైంది పార్టీ. కాగా గుజరాత్ పరివర్తన్ సంకల్ప యాత్రలో 145 బహిరంగ సభలు, 95 ర్యాలీలు నిర్వహిస్తారు. ఈ యాత్ర 5,432 కిలోమీటర్ల మేర సాగనుందని గుజరాత్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ జగదీశ్ ఠాకూర్ వెల్లడించారు.
ఈ పరివర్తన్ యాత్రలో లక్ష మంది పార్టీ కార్యకర్తలు పాల్గొంటారని చెప్పారు. ప్రజలతో కలిసి వారితో మమేకం కావడం జరుగుతుందని స్పష్టం చేశారు.
Also Read : గుజరాత్ విషాదంపై సంతాపాల వెల్లువ