Heavy Rains : వర్షాల దెబ్బకు ఏపీ..తెలంగాణ విలవిల
ఎడ తెరిపి లేకుండా కురుస్తున్న వానలు
Heavy Rains : బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడిన నేపథ్యంలో వర్షాలు ఎడ తెరిపి లేకుండా కురుస్తున్నాయి. దీంతో రవాణా పూర్తిగా స్తంభించి పోయింది. అటు ఏపీ ఇటు తెలంగాణ రాష్ట్రాలను వర్షాలు(Heavy Rains) ముంచెత్తాయి.
ఎక్కడ చూసినా వానలే. చెరువులు, కుంటలు పొంగి పొర్లుతున్నాయి. రహదారులపై నీళ్లు ప్రవహిస్తున్నాయి. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మరో వైపు మూడు రోజుల పాటు వర్షాలు దంచి కొడతాయని జాగ్రత్తగా ఉండాలని వాతావరణ కేంద్రం ఏపీ, తెలంగాణ రాష్ట్రాలను హెచ్చరించింది.
దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం, కృష్ణా, గుంటూరు, నెల్లూరు జిల్లాలలో భారీగా వర్షాల తాకిడి మొదలైంది. అంతే కాకుండా అనంతపురం, చిత్తూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరితో పాటు యానాంలో సైతం వర్షాలు దంచి కొడుతున్నాయి.
అవసరమైతే తప్పా ప్రజలు ఎవరూ బయటకు రావద్దంటూ కోరారు ఏపీ సీఎం సందింటి జగన్ మోహన్ రెడ్డి(CM Jagan). ఆయా జిల్లాల కలెక్టర్లు సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
మరో వైపు తెలంగాణలో జోరుగా కురుస్తున్న వర్షాలపై సీఎం కేసీఆర్ ఆరా తీశారు. హైదరాబాద్ లో జోరు వాన దెబ్బకు జనం విలవిల లాడుతున్నారు. రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
ఇక మేడ్చల్ మల్కాజ్ గిరి, కామారెడ్డి, నల్లగొండ, సూర్యాపేట, కరీంనగర్, జోగులాంబ గద్వాల, నారాయణపేట్, మహబూబ్ నగర్, వనపర్తి, నాగర్ కర్నూల్, రంగారెడ్డి, సంగారెడ్డి, తదితర జిల్లాలను వర్షాలు ముంచెత్తాయి. మరో మూడు రోజుల పాటు వర్షాలు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
Also Read : పోలవరంపై కేంద్రం సమావేశం