#VaccineCapital : ప్రపంచ వ్యాక్సీన్‌ రాజధానిగా మన హైదరాబాద్‍…!

Hyderabad as the 'World Vaccine Capital' ...!

Vaccine Capital  : కోవిడ్‌-19 కల్లోలానికి ఊపిరాడక సతమతం అవుతున్న సమయాన ప్రపంచ మానవాళికి వ్యాక్సీన్‌ అందుబాటులోకి రావడం శుభపరిణామం. కరోనా విసిరిన సవాళ్ళను అవకాశాలుగా మలుచుకున్న ప్రపంచ ప్రఖ్యాత ఫార్మా కంపెనీలు టీకాలను కనుగొని ప్రజల ఆరోగ్యానికి మరియు భవిష్యత్తుకు భరోసాను ఇస్తున్నారు. ఇండియాలో హైదరాబాద్‍ ఫార్మా కంపెనీలు అంతర్జాతీయ స్థాయి సాంకేతిక పరిజ్ఞానం మరియు పరిశోధనలతో కాలానుగుణంగా, మహమ్మారులు మరియు పాడు రోగాలు ప్రబలినపుడు సరైన క్రియాశీలతగల టీకాలను అతి తక్కువ ధరలకు అందించడంలో అనేక సార్లు సఫలమైనారని చరిత్ర రుజువు చేస్తున్నది. హైదరాబాద్‍ కేంద్రంగా కోవిడ్‌-19 ఔషధాలు రెమ్‌డెసివిర్‌, హైడ్రాక్సీక్లోరోక్విన్‌ మరియు ఫవీపిరవిర్‌ లాంటివి ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. కోవిడ్-19ను నిరోధించగల టీకా రూపకల్పన దేశీయ పరిజ్ఞానంతో చేయడానికి ఇండియాకు మరియు ప్రపంచ దేశాలకు హైదరాబాద్‍ కేంద్ర బిందువుగా మారింది. ఇండియాలో కోవిడ్‌ టీకాలను రూపొందించడానికి కృషి చేస్తున్న 6 కంపెనీలలో 4 కంపెనీలు హైదరాబాద్‍ కేంద్రంగా శ్రమిస్తున్నాయి.
ఐసియంఆర్ మరియు నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీల‌ సహకారంతో దేశీయ పరిజ్ఞానంతో హైదరాబాద్‍లోని భారత్‌ బయోటెక్‌ సంస్థ అతి పెద్ద 3వ దశ క్లినికల్‌ ట్రయల్స్ 26,000 వాలంటీర్లతో పూర్తి చేసే దశలో ఉన్నది. ఈ సంస్థ రూపొందించి విడుదల చేస్తున్న ‘కోవాక్సీన్’‌ టీకా‌కు ప్రభుత్వం అత్యవసర వినియోగానికి అనుమతులు కూడా ఇవ్వడం జరిగింది. కోవాక్సీన్‌ టీకా సరఫరాకు విదేశాలు కూడా క్యూ కట్టడం విశేషంగా చెప్ప వచ్చు. భారత్‌ బయోటెక్‌ కంపెనీ ఏప్రిల్‌-2021లో తీసుకురానున్న ‘కోరోఫ్లూ’ ఇంట్రానాసల్‌ కరోనా వ్యాక్సీన్‌ 300 మిలియన్‌ డోసులు తీసుకురానున్నది.
ఇప్పటి వరకు దాదాపు 140 ప్రపంచ పేటెంట్లు, 16 వ్యాక్సీన్లు, 4 బయో-థెరాప్టిక్స్, దాదాపు 116 దేశాల రిజిస్ట్రేషన్లు పొందిన చరిత్ర హైదరాబాద్‍కు చెందిన భారత్‌ బయోటెక్‌ కంపెనీకి ఉన్నది. భారత్‌ బయోటెక్‌ ద్వారా హెచ్‌1యన్‌1, రోటావైరస్‌, జపనీస్‌ ఎన్సిఫిలైటిస్‌, రాబిస్‌, చికెన్‌గున్యా, జీకా, టైఫాయిడ్‌లకు వ్యాక్సీన్లను విజయవంతంగా రూపొందించి వాడడం జరుగుతోంది. హైదరాబాద్‍లోని ‘బయోలాజికల్‌ ఈవెంట్స్’ కంపెనీ కూడా కోవిడ్‌-19 సబ్‌యూనిట్‌ వ్యాక్సీన్‌ తయారీకి డిసిజిఐ అనుమతులు పొందింది. నగరంలోని రెడ్డి ల్యాబ్స్ కూడా రష్యా కోవిడ్‌-19 వ్యాక్సీన్‌ స్పుత్నిక్‌-వి క్లినికల్‌ ట్రయల్స్ ప్రయోగాలను నిర్వహిస్తున్నది.
హైదరాబాద్‍ కేంద్రంగా రూపొందుతున్న కరోనా వ్యాక్సీన్‌ ప్రయోగాల ప్రగతిని పరిశీలించేందుకు దేశ ప్రధాని నరేంద్ర మోదీ రావడం కూడా జరిగింది. ఫైజర్-బయోయన్‌టెక్‌‌ కంపెనీలు రూపొందించిన ‘బియన్‌టి162బి2’ కరోనా టీకాలను బ్రిటన్‌ ప్రజలకు ఇవ్వడం ప్రారంభమైన విషయం మనకు తెలుసు. ఆస్ట్రాజెనెకా-ఆక్సఫర్డ్ కరోనా వ్యాక్సీన్‌ కూడా త్వరలో అందుబాటులోకి రానున్నది.
               ప్రపంచ వ్యాక్సీన్ల తయారీలో 33 శాతం, అనగా 2 బిలియన్‌ డోసులను హైదరాబాద్‍ కంపెనీలు అందిస్తున్నాయి. దేశంలో 40 శాతం బల్క్ డ్రగ్స్ మరియు 50 శాతం బల్క్ డ్రగ్‌ ఎగుమతులు హైదరాబాద్‍ నుండే జరగడం విశేషం. హైదరాబాద్‍ నగరం చుట్టు పక్కల 800లకు పైగా లైఫ్‌ సైన్స్ కంపెనీలు, 20 ఇంక్యుబేషన్‌ సెంటర్లు, 200లకు పైగా స్టార్ట్అప్‌లు, 200లకు పైగా అంతర్జాతీయ కంపెనీ (నోవార్టిస్‌, గ్లాస్కోస్మిత్‌క్లైమ్‌, ఫెర్రీ ఫార్మా, కెమో, డ్యూపాంట్‌, ఆష్‌లాండ్‌, యూయస్‌ ఫార్మకోపియా, లోంజా లాంటి)   శాఖలు మరియు దాదాపు 1,20,000 ఫార్మా ప్రొఫెషనల్స్  సేవలు అందిస్తున్నారు. హైదరాబాద్‍ నగర శివారుల్లో 600 ఘనపు కిమీ పరిధిలో ప్రపంచ స్థాయి వసతులతో ‘జీనోమ్‌ వ్యాలీ’ని 1999లో ఏర్పాటు చేశారు. దీనికి తోడుగా హైదరాబాద్‍ ఫార్మా సిటీని కూడా త్వరలో తీసుకురానున్నారు. ఈ నూతన ప్రాజెక్ట్ ద్వారా 1.7 లక్షల ప్రత్యక్ష ఉద్యోగాలు మరియు 5.6 లక్షల పరోక్ష ఉద్యోగ ఉపాధులు రానున్నాయని అంచనా వేస్తున్నారు.
                   భారత్‌ బయోటెక్‌, బయలాజికల్‌ ఈవెంట్స్, అరబిందో ఫార్మా, రెడ్డి ల్యాబ్స్, హెటరో డ్రగ్స్, శాంత బయోటెక్‌ లాంటి అంతర్జాతీయ ఖ్యాతి గడించిన కంపెనీలు అవసరాన్ని బట్టి టీకాలను తయారు చేయడం, ప్రజలకు సరసమైన ధరలకు అందించడం జరుగుతోంది. శాంత బయోటెక్‌ కంపెనీ ద్వారా 1980ల్లో హెపటైటిస్‌-బి మరియు రీకాంబినంట్‌ డియన్‌ఏ వ్యాక్సీన్లు లాంటి పలు టీకాలు ప్రపంచ దేశాలకు అందుబాటులోకి రావడం గర్వకారణంగా చెప్పవచ్చు.‌ భారతీయ ప్రముఖ పరిశోధనా సంస్థ సిసియంబి-హైదరాబాద్‍ కూడా కరోనా వ్యాక్సీన్ తయారీలో నిమగ్నం అయ్యింది.‌ మిలియన్ల డోసుల వ్యాక్సీన్‌ తయారీ తరువాత రవాణా నిమిత్తం అంతర్జాతీయ విమానాశ్రయం మరియు శీతల వసతులతో పంపిణి చేయడానికి ఏర్పాట్లు చేయడం జరుగుతున్నది. కోవిడ్‌-19 వ్యాక్సీన్‌ తయారీ కేంద్రాల పరిశోధనలను ప్రత్యక్షంగా పరిశీలించడానికి 64 విదేశీ ప్రతినిధులు హైదరాబాద్‍కు రావడంతో పాటు అనేక దేశాలు టీకాల సరఫరాకు విజ్ఞప్తులు చేయడం సంతోషదాయకం. ప్రపంచవ్యాప్తంగా 190 దేశాల రాయబార ప్రతినిధులు మన దేశ వ్యాక్సీన్‌ ప్రగతిని సునిశితంగా పరిశీలిస్తున్నారు. రానున్న రోజుల్లో ప్రపంచదేశాలకు వ్యాక్సీన్‌ కేంద్రంగా హైదరాబాద్‍ మహానగరం నిలిచి, విశ్వ మానవాళి ఆరోగ్య పరిరక్షణకు కృషి చేయాలని మనందరం కోరుకుందాం.

No comment allowed please