India-Pakistan: పాకిస్థాన్‌ కు నీళ్లు బంద్‌ చేసిన భారత్ !

పాకిస్థాన్‌ కు నీళ్లు బంద్‌ చేసిన భారత్ !

India-Pakistan: జమ్మూ-కాశ్మీర్ లో షాపుర్‌ కంది బ్యారేజ్‌ నిర్మాణం పూర్తవడంతో పాకిస్థాన్‌ కు రావి నది జలాలను భారత్‌ పూర్తిగా నిలిపివేసినట్లు తెలుస్తోంది. సుమారు 45 ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఈ ఆనకట్ట నిర్మాణం ఎట్టకేలకు పూర్తి కావడంతో సింధూ జలాల ఒప్పందం ప్రకారం… సింధూ నది ఉపనది రావి జలాలన్నీ ఇక మనకే దక్కనున్నాయి. దీనితో ఇన్ని రోజులు పాకిస్థాన్ కు వెళ్తున్న రావి నది జలాలు… ఇక నుండి జమ్మూకశ్మీర్‌ లోని కథువా, సాంబా జిల్లాలకు మళ్లించనున్నారు. దీని వల్ల ఆయా జిల్లాల్లో సుమారు 32 వేల హెక్టార్లలో సాగు నీరు అందనుంది. అంతేకాకుండా… ఈ డ్యామ్‌ నుంచి ఉత్పత్తి అయ్యే జల విద్యుత్తులో 20 శాతాన్ని జమ్మూకశ్మీర్‌ కు ఇవ్వనున్నారు. జమ్మూకశ్మీర్‌ తో పాటు పంజాబ్‌, రాజస్థాన్‌ రాష్ట్రాలకూ రావి జలాలు ఉపయోగపడనున్నాయి.

India-Pakistan – సింధూ జలాల ఒప్పందం అంటే ఏమిటి ?

1960లో భారత్‌(India), పాకిస్థాన్ మధ్య సింధూ జలాల ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందంలో సింధు, జీలం, చీనాబ్‌ నదులు పాకిస్థాన్ కు దక్కగా… రావి, బియాస్‌, సట్లెజ్‌ నదులు భారత్‌ కు దక్కాయి. అప్పటి భారత ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ, పాక్‌ అధ్యక్షుడు అయూబ్‌ ఖాన్‌ ఈ సింధూ జలాల ఒప్పందంపై సంతకాలు చేశారు. అయితే రావి నదిపై ఆనకట్టలు లేకపోవడంతో భౌగోళిక పరిస్థితుల బట్టి… నీరు పాకిస్థాన్ వైపుకు ప్రవహించేది. దీనితో రావి నది నుంచి పాకిస్థాన్‌ కు నీటి ప్రవాహాన్ని నిలిపివేసేందుకు ఆనకట్టలు నిర్మించాలని భారత్‌ నిర్ణయించింది.

ఇందుకోసం 1979లో పంజాబ్‌, జమ్మూకశ్మీర్‌ ప్రభుత్వాల మధ్య ఒప్పందం జరిగింది. రావి నదిపై ఎగువవైపు రంజిత్‌ సాగర్‌ డ్యామ్‌, కిందివైపు షాపుర్‌ కంది బ్యారేజ్‌ను నిర్మించేందుకు అప్పటి జమ్మూకశ్మీర్ సీఎం షేక్‌ మహమ్మద్‌ అబ్దుల్లా, పంజాబ్‌ సీఎం ప్రకాశ్‌ సింగ్‌ బాదల్‌ సంతకాలు చేశారు. 1982లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. 1998 నాటికి ఇది పూర్తవ్వాల్సి ఉండగా వివిధ కారణాలతో ఆలస్యమైంది.

2001లో రంజిత్‌ సాగర్‌ డ్యామ్‌ నిర్మాణం పూర్తవ్వగా… షాపుర్‌ కంది బ్యారేజ్‌ ఆగిపోయింది. దీనితో పాకిస్థాన్‌(Pakistan) కు నీటి ప్రవాహం కొనసాగింది. 2008లో షాపుర్‌ కంది బ్యారేజ్‌ ను జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి… 2013లో నిర్మాణం ప్రారంభించారు. అయితే పంజాబ్‌, జమ్మూకశ్మీర్‌ మధ్య విభేదాలతో సంవత్సరానికే ఈ ప్రాజెక్టు పనులు ఆగిపోయాయి. చివరకు 2018లో కేంద్ర ప్రభుత్వం ఇరు రాష్ట్రాల మధ్య మధ్యవర్తిత్వం జరపడంతో నిర్మాణ పనులు తిరిగి మొదలయ్యాయి. ఎట్టకేలకు ఈ నిర్మాణం పూర్తవ్వడంతో ఆదివారం (ఫిబ్రవరి 25) నుంచి పాక్‌ కు నీటి ప్రవాహాన్ని పూర్తిగా నిలిపివేసినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.

Also Read : Assam CM : నా ప్రాణం ఉన్నంత వరకు బాల్యవివాహాలకు అనుమతివ్వను

Leave A Reply

Your Email Id will not be published!