Indian Railways: భారత సైనిక రైళ్ల కదలికలపై పాకిస్తాన్ నిఘా ? రైల్వే శాఖ హై ఎలర్ట్ !
భారత సైనిక రైళ్ల కదలికలపై పాకిస్తాన్ నిఘా ? రైల్వే శాఖ హై ఎలర్ట్ !
పహల్గాం ఉగ్రదాడి తరువాత భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య నెలకొన్ని ఉద్రిక్త పరిస్థితుల కారణంగా భారత సైనిక రైళ్ల కదలికలను తెలుసుకునేందుకు పాక్ నిఘా సంస్థలు ప్రయత్నించే అవకాశాలు ఉన్నాయని రైల్వే శాఖ అనుమానిస్తోంది. ఇందుకు సంబంధించిన నిఘా వర్గాల సమాచారం కూడా ఉండటంతో రైల్వే శాఖ అప్రమత్తమైంది. సైనిక రైళ్లకు సంబంధించిన సమాచారాన్ని అనధికార వ్యక్తులతో పంచుకోవద్దని రైల్వే ఉద్యోగులను హెచ్చరించింది. ఇందుకు సంబంధించిన అడ్వయిజరీ ఈ నెల 6న జారీ చేసింది.
”పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ సంస్థలు రైల్వే అధికారులకు ఫోన్ చేసి మిలటరీ ప్రత్యేక రైళ్ల సమాచారం అడగవచ్చు. మిలటరీ వింగ్ ఆఫ్ రైల్వేస్ కు మినహా అనధికార వ్యక్తులెవరితోనైనా ఈ సమాచారం పంచుకుంటే దానిని భద్రతా ఉల్లంఘన కింద భావించాల్సి ఉంటుంది. ఇందువల్ల జాతి భద్రతకు తీవ్ర ముప్పు వాటిల్లే అవకాశం ఉంటుంది” అని రైల్వే జోన్ల ప్రిన్సిపల్ చీఫ్ ఆపరేషన్ మేనేజర్లకు రైల్వే బోర్టు సందేశం పంపింది.
మిల్ రైల్ అనేది భారతీయ రైల్వేలో ప్రత్యేక విభాగం. సైనిక వ్యూహాత్మక ప్రణాళికల్లో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు, యుద్ధం వంటి పరిస్థితుల్లో జవాన్లతోపాటు ట్యాంకులు, పరికరాలు, ఇతర వస్తువుల రవాణా వీటి ద్వారానే కొనసాగుతుంది. ఇందుకు అవసరమైన సంప్రదింపులు రైల్వేబోర్డు ద్వారా కాకుండా ఈ సైనిక విభాగం ద్వారానే జరుగుతాయి. ఢిల్లీలోని సేనా భవన్ లో దీని కార్యాలయం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇండియన్ రైల్వేస్ మిల్ రైల్ విషయంలో హై ఎలర్ట్ ప్రకటించిది.