Jairam Ramesh : రాహుల్ గాంధీతో మాట్లాడితే ‘ఐబీ’ టార్గెట్
కాంగ్రెస్ నేత జైరాం రమేష్ ఫైర్
Jairam Ramesh : దేశానికి ద్వేషం కాదు కావాల్సింది ప్రేమ అనే నినాదంతో రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర కొనసాగుతోంది. ఈ సందర్బంగా రాహుల్ గాంధీని కలిసిన వారిని, మాట్లాడిన వ్యక్తులను ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) ప్రశ్నిస్తోందంటూ సంచలన ఆరోపణలు చేశారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, పార్టీ మీడియా ఇంఛార్జ్ జైరాం రమేష్.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా కాంగ్రెస్ పార్టీపై ఫోకస్ పెట్టారని మండిపడ్డారు. చిల్లర రాజకీయాలు చేయడం బీజేపీకి అలవాటుగా మారిందని ఆరోపించారు. రోజు రోజుకు రాహుల్ చేపట్టిన యాత్రకు భారీ ఎత్తున జనాదరణ లభిస్తోందని, దీనిని తట్టుకోలేక విమర్శలు చేస్తున్నారంటూ మండిపడ్డారు జైరాం రమేష్(Jairam Ramesh).
ఇదిలా ఉండగా రాహుల్ గాంధీతో ఆర్మీకి చెందిన రిటైర్డు అధికారులు, మేధావులు ఢిల్లీలో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇది దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. చైనా, పాకిస్తాన్ లు భారత్ పై యుద్దం చేసేందుకు రెడీ అవుతున్నాయని హెచ్చరించారు.
ఇంత జరుగుతున్నా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించడం లేదన్నారు. ఈ సందర్భంగా రాహుల్ ను కలిసిన వారిని వేధింపులకు గురి చేస్తున్నారని, ఏమేం కాపీలు ఇచ్చారో అవి తమకు ఇవ్వాలని కోరుతున్నారని ఆరోపించారు జైరాం రమేష్.
భారత్ జోడో యాత్రను చూసి మోదీ, అమిత్ షా, బీజేపీ పరివారం భయాందోళనకు గురవుతోందని ఎద్దేవా చేశారు.
Also Read : తండ్రి రాజీవ్ కు తనయుడి నివాళి