JD Lakshmi Narayana : అధికారుల బాధ్యతా రాహిత్యం నిజం
ప్రజా సమస్యలపై ఆన్ లైన్ పోర్టల్ అవసరం
JD Lakshmi Narayana : సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మినారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరు తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలలో అధికారుల పనితీరు దారుణంగా ఉందన్నారు. ప్రధానంగా సర్కార్ ఆఫీసుల్లో 50 శాతానికి పైగా అధికారులు బాధ్యతగా పని చేయడం లేదని ఆరోపించారు. ఇందుకు సంబంధించి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
సమస్యలు పరిష్కారం కావాలంటే ముందు ఆన్ లైన్ పోర్టల్ ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు జేడీ లక్ష్మీనారాయణ. ఇదిలా ఉండగా ఇరు రాష్ట్రాలలో అధికారుల, నాయకుల పనితీరు, అవినీతిపై యూత్ ఫర్ యాంటీ కరప్షన్ ఆధ్వర్యంలో 45 రోజుల పాటు సర్వే చేపట్టిందన్నారు.
ఇందుకు సంబంధించి సర్వే రిపోర్టును విడుదల చేశారు జేడీ లక్ష్మినారాయణ(JD Lakshmi Narayana), మాజీ ఎమ్మెల్యే రాములుతో కలిసి ఆవిష్కరించారు. సమాచార హక్కు చట్టాన్ని ఆయుధంగా మార్చుకుని సంస్థ గ్రామ స్థాయి నుంచి జాతీయ స్థాయి దాకా ప్రజల్లో అవగాహన కల్పిస్తోందన్నారు జేడీ.
సర్వేలో 26 వేల మందికి పైగా పాల్గొన్నారని తెలిపారు. ఆఫీసులకు వెళితే లంచం బహిరంగంగా అడుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలని, కాల్ చేసేందుకు ఓ నెంబర్ ఏర్పాటు చేయాలని సూచించారు జేడీ లక్ష్మీనారాయణ.
ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు, సూచనలను ఒక చోటుకు చేర్చి కోర్టులో దాఖలు చేస్తే బావుంటుందని తెలిపారు. వీటిని పిటిషన్ వేస్తే కోర్టు ఆయా ప్రభుత్వ శాఖలకు నోటీసులు పంపిస్తుందని స్పష్టం చేశారు జేడీ లక్ష్మీనారాయణ. అవినీతిపై సంఘటితంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.
Also Read : ఈడీ కథేంటి..డాడితో డాటర్ భేటీ