K Rama Krishna : ఏపీలో గాడి తప్పిన విద్యా వ్యవస్థ
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ
K Rama Krishna : ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి నిర్వాకం వల్ల రాష్ట్రంలో విద్యా వ్యవస్థ పూర్తిగా గాడి తప్పిందంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ. నాడు నేడు పేరుతో గొప్పగా ప్రచారం చేసుకుంటోందని ఆరోపించారు. కానీ ఇదే క్రమంలో పెద్ద ఎత్తున ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎందుకు పిల్లలు రావడం లేదనే దానిపై ఇప్పటి వరకు అటు విద్యా శాఖ కానీ ఇటు సీఎం జగన్ రెడ్డి కాని ఆలోచించడం లేదన్నారు.
రాష్ట్రంలో 9 వేలకు పైగా ఉన్న బడుల్లో ఒక్క టీచర్ మాత్రమే ఉన్నారని, ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను ఎందుకు భర్తీ చేయడం లేదని కె. రామకృష్ణ(K Rama Krishna) ప్రశ్నించారు. గత 9 నెలల కాలంలో ఏకంగా రాష్ట్రంలో 6.41 లక్షల మంది విద్యార్థులు ప్రైవేట్ స్కూళ్లకు వెళ్లి పోయారని పేర్కొన్నారు. ఇదే సమయంలో 4,234 ప్రాథమిక పాఠశాలలను ఇతర బడుల్లో విలీనం చేశారంటూ ఆరోపించారు కె. రామకృష్ణ.
ఇక యూనివర్శిటీల విషయానికి వస్తే మొత్తం వైస్ ఛాన్సలర్ ను తనకు నిత్యం భజన చేసే వారిని నియమించారంటూ మండిపడ్డారు. హాస్టల్ విద్యార్థులకు ప్రభుత్వం ఇచ్చే ఛార్జీలు సరిపోక విద్యార్థులు రోడ్డెక్కుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు కె.రామకృష్ణ. విద్యా రంగాన్ని నాశనం చేసే కుట్రతో వైసీపీ ప్రభుత్వం పాలన సాగిస్తోందని ధ్వజమెత్తారు.
Also Read : Raghuram Rajan Comment : రాజన్ మార్గం దేశానికి అవసరం
