KA Paul : కామారెడ్డి మాస్టర్ ప్లాన్ కు వ్యతిరేకంగా రైతులు కదం తొక్కారు. ఇప్పటికే తమ విలువైన భూములకు ఎసరు పెడుతున్నారంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై మండి పడుతున్నారు. ఇండస్ట్రియల్ జోన్ పేరుతో , మాస్టర్ ప్లాన్ తీసుకొచ్చి తమ పొలాలు కాజేయాలని చూస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
దీనిని తట్టుకోలేక ఓ రైతు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. దేశ వ్యాప్తంగా చర్చకు దారితీసింది. మరో వైపు రైతులకు అండగా భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీలు మద్దతు తెలిపాయి. చని పోయిన రైతు కుటుంబాన్ని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ పరామర్శించారు. ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
ఇదే సమయంలో కామారెడ్డికి వెళ్లేందుకు బయలు దేరిన రేవంత్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. మరో వైపు బండి సంజయ్ ని అరెస్ట్ చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ సందర్భంగా ప్రజా శాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్(KA Paul) సంచలన కామెంట్స్ చేశారు. కామారెడ్డి రైతులు చేస్తున్న పోరాటం న్యాయ బద్దమైనదని పేర్కొన్నారు.
వారి విలువైన భూములను కాజేయాలని అనుకోవడం దారుణమన్నారు. కలెక్టర్ వెంటనే రైతులకు న్యాయం చేయాలని , అంత వరకు ప్రజా శాంతి పార్టీ మద్దతుగా ఉంటుందని స్పష్టం చేశారు. ప్రాణాలు కోల్పోయిన రైతు కుటుంబాన్ని ఆదుకోవాలని, రూ. 50 లక్షలు పరిహారంగా ఇవ్వాలని కేఏ పాల్ డిమాండ్ చేశారు.
అలుపెరుగని రీతిలో పోరాటం చేస్తున్న రైతులకు తాను సలాం చేస్తున్నానని పేర్కొన్నారు. ప్రస్తుతం కేఏ పాల్(KA Paul) చేసిన కామెంట్స్ ఆసక్తిని రేపాయి.
Also Read : ఉచిత బియ్యం పథకం పొడిగింపు