అవినీతిలో దేశంలోనే బస్వరాజ్ బొమ్మై సారథ్యంలోని భారతీయ జనతా పార్టీ సర్కార్ నెంబర్ వన్ గా నిలిచిందని సంచలన ఆరోపణలు చేశారు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే. మంగళవారం ఏఐసీసీ చీఫ్ మీడియాతో మాట్లాడారు. గతంలో ఎన్నడూ లేని రీతిలో ప్రతి పనికి ఓ రేటు అంటూ నిర్ణయించిన ఘనత బొమ్మైకే దక్కుతుందని ఎద్దేవా చేశారు.
విద్య, ఉపాధి అటకెక్కిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈసారి జరగబోయే ఎన్నికల్లో అవినీతి, అధర్మానికి నీతికి, ధర్మానికి మధ్య జరుగుతున్న పోరాటమని చెప్పారు మల్లికార్జున్ ఖర్గే. ప్రస్తుతం అవినీతిమయమైన బీజేపీ ప్రభుత్వాన్ని భరించలేక పోతున్నారని , ప్రజలు మార్పు కోరుకుంటున్నారని స్పష్టం చేశారు.
రాష్ట్రంలోని 224 అసెంబ్లీ నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీకి కనీసం 150కి పైగా సీట్లు లభించడం ఖాయమని జోష్యం చెప్పారు ఏఐసీసీ చీఫ్. కేంద్రంలోని మోదీ సర్కార్ ఇప్పటికే ప్రభుత్వ ఆస్తులను అప్పనంగా బడా బాబులకు కట్టబెట్టిందని, రాష్ట్రంలో ఇంకేం మిగిలి ఉందని ప్రజలు బీజేపీని ఆదరిస్తారని ప్రశ్నించారు మల్లికార్జున్ ఖర్గే. బీజేపీ పనై పోయిందని , ఆపార్టీకి చెందిన సీనియర్ నాయకులే తమ పార్టీలోకి వస్తున్నారని ఇంతకు మించి తాను ఏమీ చెప్పలేనన్నారు.