కర్ణాటకలో 224 స్థానాలకు జరిగిన పోలింగ్ ముగిసింది. చెదురు మదురు సంఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా పూర్తి కావడంతో ఈసీ ఊపిరి పీల్చుకుంది. ఇక అన్ని పార్టీలు తామంటే తాము గెలుస్తామని ఎప్పటి లాగానే ప్రకటించాయి. ఇక ఎగ్జిట్ పోల్స్ బయటకు వచ్చాయి. అన్ని కూడా హంగ్ ఏర్పాటుకు ఛాన్స్ ఉందంటూ పేర్కొనడం విశేషం. మొత్తం 10 ఎగ్జిట్ పోల్స్ బయటకు వచ్చాయి. వీరిలో ఇద్దరు కాంగ్రెస్ పార్టీకి ఒకరు బీజేపీకి సంపూర్ణ విజయం సాధిస్తాయని అంచనా వేశాయి.
హెచ్ డీ కుమార స్వామికి చెందిన జనతాదళ్ సెక్యులర్ పార్టీ కింగ్ మేకర్ గా మారే ఛాన్స్ ఉందంటూ అంచనా వేస్తున్నారు. మొత్తం సీట్లలో మెజారిటీ మార్క్ దాటాలంటే కనీసం 113 సీట్లకు పైగా రావాల్సి ఉంటుంది. ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా, టైమ్స్ నౌట్ ఈటీజీ కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ ఆధిక్యం వస్తుందని పేర్కొన్నాయి.
ఇక ఇండియా టీ సీఎన్ఎక్స్ , జీ న్యూస్ కాంగ్రెస్ పార్టీకి 113 కంటే తక్కువ సీట్లు వస్తాయని తెలిపింది. న్యూస్ నేషన్ , సీజీఎస్ బీజేపీ విజయాన్ని అంచనా వేసింది. సువర్ణ న్యూస్ జన్ కీ బాత్ భారతీయ జనతా పార్టీకి కనీసం 117 సీట్లు వస్తాయని తెలిపింది. మరో ఐదు ఎగ్జిట్ పోల్స్ మాత్రం కాంగ్రెస్ , బీజేపీకి సరైన మెజారిటీ రావాలని జేడీఎస్ కీలకంగా మారబోతోందని స్పష్టం చేశాయి.
