కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ డైరెక్టర్ గా కర్ణాటకకు చెందిన పోలీస్ ఉన్నతాధికారి ప్రవీణ్ సూద్ ను కేంద్రం నియమించింది. ఆదివారం ఈ మేరకు కీలక ప్రకటన చేసింది. ఆయన నియామకం రెండేళ్ల పాటు ఉంటుంది. ప్రవీణ్ సూద్ పేరును ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధనంజయ చంద్రచూడ్ తో పాటు లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న మల్లికార్జున్ ఖర్గే తో కూడిన ఉన్నత స్థాయి కమిటీ ఖరారు చేసింది.
ఇటీవలే సర్వోన్నత న్యాయ స్థానం ఉన్నత స్థాయి పదవులలో నియమించే వారి పట్ల కేంద్రం ఆచి తూచి వ్యవహరించాలని సూచించింది. ప్రతిపక్ష నాయకుడి ప్రమేయం లేకుండా ఎవరినీ ఎంపిక చేయకూడదని స్పష్టం చేసింది. ఇటీవలే కేంద్రం ఆదరాబాదరాగా ఈసీ కమిషనర్ ను నియమించింది. ఈ అంశంపై మోదీ సర్కార్ ను ఏకి పారేసింది. భవిష్యత్తులో ఇలాంటివి ఉండ కూడదని ఆదేశించింది.
ఇదిలా ఉండగా సీబీఐ నూతన డైరెక్టర్ గా నియమితులైన ప్రవీణ్ సూద్ కర్ణాటక కేడర్ కు చెందిన 1986 ఐపీఎస్ బ్యాచ్ అధికారి. తన పదవీ కాలం పూర్తయిన తర్వాత ప్రస్తుత చీఫ్ సుబోధ్ కుమార్ జైస్వాల్ నుండి బాధ్యతలు స్వీకరించనున్నారు.
ఇదిలా ఉండగా ప్రస్తుతం నిర్దేశించిన కాల పరిమితిని పొడిగించేందుకు వీలుంటుంది. అయితే ఎంపిక కమిటీ ఒప్పుకోవాల్సి ఉంటుంది. కాగా సీబీఐ డైరెక్టర్ పదవికి ముగ్గురు సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లను ఉన్నత స్థాయి కమిటీ షార్ట్ లిస్ట్ చేసింది. ఆ తర్వాతే సూద్ నియామకం జరిగింది.
