KCR: ఏప్రిల్ 27న వరంగల్ లో కేసీఆర్ భారీ బహిరంగ సభ
ఏప్రిల్ 27న వరంగల్ లో కేసీఆర్ భారీ బహిరంగ సభ
KCR : గత కొంతకాలంగా సైలంట్ గా ఉన్న మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR)… మరల యాక్టివ్ అయ్యారు. గత రెండు రోజులుగా పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, నాయకులతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. టీఆర్ఎస్ తరువాత బీఆర్ఎస్(BRS) గా రూపాంతరం చెందిన తన పార్టీ ఏప్రిల్ 27వ తేదీన 25వ వసంతంలోనికి అడుగుపెట్టడంతో… ఈ పార్టీ ఆవిర్భావ సభను భారీ ఎత్తున నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ రోజున వరంగల్‌లో లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహించాలని పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. వరంగల్ సమీపంలో సభకు అనువైన ప్రదేశాలను పరిశీలించి, త్వరలో సభావేదిక స్థలాన్ని నిర్ణయించనున్నట్టు కేసీఆర్ తెలిపారు. సభ నిర్వహణ ఏర్పాట్ల బాధ్యతలను పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావుకు, సహకార బాధ్యతలను మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి అప్పగించారు. త్వరలోనే సభ నిర్వహణ కమిటీలను కూడా వేయనున్నారు.
KCR Meeting
అంతేకాదు పార్టీ ఆవిర్భావ రజతోత్సవాలను ఏడాది పాటు ఘనంగా, తెలంగాణ సమాజం గర్వించేలా నిర్వహించాలని కేసీఆర్ ఆదేశించారు. తెలంగాణలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఎక్కువగా దృష్టిసారించాలని… భారీగా ఉద్యమాలు నిర్వహించాలని కేసీఆర్(KCR) పార్టీ శ్రేణులకు సూచించారు. ప్రజలు బీఆర్ఎస్ ను తెలంగాణ ఇంటి పార్టీగా భావిస్తారని, ప్రస్తుతం జనం అనేక కష్టాల్లో ఉన్నారని… ప్రజాసమస్యలపై మరింతగా పోరాడదామని ఆయన పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి నివాసంలో శుక్రవారం జరిగిన బీఆర్ఎస్ ముఖ్యనేతల సమావేశంలో కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంతోపాటు దేశంలో వర్తమాన రాజకీయ పరిస్థితులపై సమావేశంలో సుదీర్ఘ చర్చ జరిగింది. అందుకనుగుణంగా పార్టీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అనుసరించాల్సిన వ్యూహాలు, అమలు చేయాల్సిన రాజకీయ ఎత్తుగడలపై చర్చించారు.
ఈ సందర్భంగా పార్టీ నాయకులతో కేసీఆర్(KCR) మాట్లాడుతూ… ‘‘ఎన్నో త్యాగాలతో తెలంగాణను సాధించుకున్నాం. పదేళ్లపాటు ఎంతో అప్రమత్తతతో స్వరాష్ట్రంలో పాలనను దేశానికే ఆదర్శంగా నిలుపుకొన్నాం. అంతటి గొప్ప ప్రగతి సాధించిన తెలంగాణ సమాజం ఇప్పుడు కష్టాల్లో ఉంది. ఇలాంటి సందర్భంలో నిర్వహించుకుంటున్న రజతోత్సవాలు… కేవలం పార్టీకే పరిమితం కావొద్దు. యావత్ తెలంగాణ సమాజానికి ఇందులో భాగస్వామ్యం ఉంది. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను మొదటి నుంచీ కాపాడుకుంటూ వస్తున్న బీఆర్ఎస్ ఈ సమాజానికి రక్షణ కవచం. ఈ విషయం గత 14 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ద్వారా మరోసారి స్పష్టమైంది. తెలంగాణ సమాజంలో రాష్ట్ర ప్రభుత్వం పట్ల నెలకొన్న అసంతృప్తి, అనిశ్చితే నిదర్శనం. కాంగ్రెస్ ఆశపెట్టిన గ్యారంటీలను, వాగ్దానాలను నమ్మిన ప్రజలు.. నేడు రాష్ట్ర ప్రభుత్వ నిజ స్వరూపాన్ని తెలుసుకున్నారు. ఇక ఎప్పుడు ఎన్నికలు వచ్చినా.. బీఆర్ఎస్ కు బ్రహ్మరథం పట్టేందుకు సిద్ధంగా ఉన్నారు.
బహిరంగ సభ సన్నాహక సమావేశాలను నియోజకవర్గాల వారీగా నిర్వహించాలి. త్వరలో కమిటీలను వేస్తాం. వరంగల్ బహిరంగ సభ అనంతరం… పార్టీని గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు సంస్థాగతంగా పటిష్ఠ పరిచి, ఆ దిశగా కొత్త కమిటీలను ఏర్పాటు చేస్తాం. ఆ తర్వాత నూతన కమిటీల బాధ్యులతో ప్రతినిధుల సభను నిర్వహిస్తాం. శిక్షణ తరగతులు కూడా చేపడతాం. పార్టీలో యువత, మహిళా భాగస్వామ్యం పెంచాలి. కేంద్రంలో ఏ పార్టీ ప్రభుత్వమున్నా తెలంగాణ సమాజానికి వ్యతిరేకంగానే పని చేస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పార్టీని పటిష్ఠం చేసుకొని.. దేశ రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాల పట్ల నిత్యం అప్రమత్తతతో ఉండాలి.
తెలంగాణ ఇంటి పార్టీ ప్రాతినిధ్యం పార్లమెంటులో లేకపోవడం వల్ల రాష్ట్ర హక్కులకు భంగం వాటిల్లుతోంది. ఇదే విషయాన్ని ప్రజలకు మరింతగా అర్థమయ్యేలా చెప్పాలి. పార్లమెంటులో బీఆర్ఎస్ ఎంపీల ప్రాతినిధ్యం ఉంటే లభించే ప్రయోజనాలపై అవగాహన కల్పించాలి. రాష్ట్ర హక్కులను కాపాడుకునే దిశగా ప్రజల్లో చైతన్యాన్ని పెంపొందించాలి. తెలంగాణ ప్రజల ప్రయోజనాలను దెబ్బతీస్తున్న రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల వైఖరులను తిప్పికొట్టాలి. తెలంగాణ సమాజ ఆకాంక్షలకు అనుగుణంగా భారీ బహిరంగ సభను నిర్వహించాలి’’ అని కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.
Also Read : Sabitha Indrarreddy: మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డికు అస్వస్థత